టాలీవుడ్ (Tollywood) లో రూ.30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నాని (Nani) కూడా ఒకడు. నాలుగేళ్ళ కిందే ఎంసిఏ సినిమాతో రూ.40 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. అయితే అప్పుడున్న పరిస్థితులు. ఇప్పటి పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా విజయం సాధిస్తే 30 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే. పైగా నాని లాంటి హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రూ.30 కోట్లు రావడం కష్టమేం కాదు. అయితే ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాను ఓటిటికే అమ్మేసారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోతో మాటా మంతి కూడా పూర్తైపోయాయి కేవలం సంతకాలు పెట్టడం మాత్రమే తరువాయి అనే వార్తలొస్తున్నాయి.
ఇన్ని రోజులు థియేటర్స్ అని కూర్చున్న నిర్మాతలు ఎందుకు మాట తప్పారు.. వాళ్లు మాట తప్పేంత అమౌంట్ అమెజాన్ ఎంత చెప్పుంటుంది అని అంతా ఆలోచిస్తున్నారు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుస్తుంది. టక్ జగదీష్ కోసం కేవలం ఓటిటి డీల్ రూ.37 కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది. అందులో డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ లేవు.. కేవలం ఓటిటి మాత్రమే. నాని సినిమా ఒకవేళ థియేటర్ లో విడుదలై విజయం సాధించినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.37 కోట్లు తీసుకురావడం దాదాపు అసాధ్యం. అందుకే నిర్మాతలు కూడా ఈ రేటుకే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ చిత్ర బడ్జెట్ 20 కోట్ల లోపే అయినా.. రెండు కరోనా సీజన్స్ చూసారు కాబట్టి వడ్డీలు కూడా భారీగానే పెరిగిపోయాయి. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది.
ఈ లెక్కన చూసుకుంటే స్వల్ప లాభాలకే టక్ జగదీష్ ను ఓటిటికి ఇచ్చారనుకోవచ్చు. మరోవైపు శాటిలైట్, డబ్బింగ్ అన్నీ కలిపి మరో 12 కోట్ల వరకు వస్తున్నాయి. మొత్తంగా టక్ జగదీష్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.50 కోట్ల వరకు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే బెటర్ ఆఫర్ రాదని నిర్ణయించుకున్న తర్వాతే.. నానికి ఇష్టం లేకపోయినా కూడా ఓటిటి వైపు అడుగులు వేస్తున్నాడు టక్ జగదీష్. అన్నీ కుదిర్తే సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
SR కళ్యాణమండపం సినిమా హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ థియేటర్స్ కోసం చూస్తున్నారు. ఏదేమైనా కూడా అటూ ఇటూ ఊగుతూ మధ్యలోనే ఉండిపోతుంది టక్ జగదీష్. శివ నిర్వాణ (Shiva Nirvana)తెరకెక్కించిన ఈ చిత్రంలో రితూ వర్మ (Ritu Varma) హీరోయిన్గా నటించింది. మజిలీ సినిమాను నిర్మించిన షైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గరపాటి టక్ జగదీష్‌ను నిర్మించారు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!