Shiva Jyothi | ప్రముఖ యాంకర్ శివ జ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. ఇటీవల ఆమె తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డ్‌ను బ్లాక్ చేసింది. ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. అయినా, టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది.
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తీర్మాన్ సావిత్రిగా మంచి పేరు సంపాదించింది. ఓ న్యూస్ చానల్లో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ అందరి ప్రశంసలు పొందింది. 2019లో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం పలు టీవీ షోలు, ఈవెంట్స్‌లకు హాజరవుతుంది. ఆమె సొంతంగా యూట్యూబ్ చానెల్‌ను సైతం నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం కోసం క్యూలైన్లో ఉన్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ ప్రసాదం.. మేం రిచెస్ట్ బిచ్చగాళ్లం’ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తిరుమల అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్‌తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో శివ జ్యోతి ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. ‘తిరుమల ప్రసాదం గురించి నేను చెప్పిన పదాలు చాలా మందికి బాధ కలిగించాయి. ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నిజంగా క్షమించండి. వివరణ ఇవ్వక ముందు ఇదే నా తొలి మాట. ‘రిచ్’ అని అన్నది రూ.10,000 ఎల్1 లైన్లో నిల్చున్నాం అనే ఉద్దేశంతో మాత్రమే. ‘కాస్ట్లీ లైన్’ అనేదాన్ని అలా మాట్లాడాను. కానీ, నా ఇంటెన్షన్ అసలు అది కాదు’ అని చెప్పుకొచ్చింది. అలాగే, ‘నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు తెలుసు వేంకటేశ్వర స్వామిపై నాకు ఉన్న భక్తి ఎంత బలమో. మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో నేను చేసే వ్రతాల వివరాలు సోషల్ మీడియాలో చెబుతున్నా. అవి ఎవరూ చూడలేదు. కానీ, పొరపాటున వచ్చిన ఈ మాటలు మాత్రమే అందరికీ కనిపించాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది
శివజ్యోతి క్షమాపణలు చెప్పినా టీటీడీ మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. భవిష్యత్‌లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా ఆధార్‌ను బ్లాక్ చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి. టీటీడీ నిర్ణయం నేపథ్యంలో ఆమె ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.