Tollywood | తెలుగు సినిమా ఇండస్ట్రీకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల, ఇండియన్ మూవీలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్లో పెద్ద నష్టం వచ్చే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం, అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ (పన్ను) వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే, భారతదేశంలో నిర్మించిన సినిమాలను అమెరికాలో విడుదల చేయాలంటే డబుల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ ఆదరణ ఉంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్లలో 75-80% వరకు నార్త్ అమెరికా నుంచే వస్తుంది.
పుష్ప2 – ₹360 కోట్లు, బాహుబలి 2 – ₹180 కోట్లు, కల్కి 2898 AD – ₹165 కోట్లు, RRR – ₹133 కోట్లు, OG – ₹45 కోట్లు, మిరాయ్ – ₹26 కోట్లు ఇలా సంవత్సరానికి రూ. 1500 కోట్ల పైగా తెలుగు సినిమాలు అమెరికా నుంచే సంపాదిస్తున్నాయి. ఈ 100% టారిఫ్ వల్ల ఈ మొత్తం దాదాపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్ ధర $12–$20 ఉంటుంది. 100% టారిఫ్ వేస్తే, ఈ ధరలు రెండింతలు కావాలి. దాంతో ప్రేక్షకులు సినిమా చూడటం తగ్గిపోతారు. ఇంకా, కలెక్షన్లలో సగం ట్యాక్స్‌గా పోతే, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను కొనడం ఆపివేస్తారు. దీనివల్ల తెలుగు సినిమాలకు అమెరికాలో విడుదల అవడం కష్టమవుతుంది.
ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లలో, ఓటీటీలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఓవర్సీస్ నుంచే కొంత ఆదాయం వస్తోంది. ఉదాహరణకు మిరాయ్ – ₹26 కోట్లు, లిటిల్ హర్ట్స్ కూడా మంచి వసూళ్లే సాధించింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఇవి కూడా ఆగిపోతే, చిన్న నిర్మాతలు సినిమాలు తీయాలనే ఆసక్తి కోల్పోతారు. ట్రంప్ పాలసీ ప్రకారం, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమాలకు టారిఫ్‌లు వర్తించవు. అంటే ట్యాక్స్ లేదు. కానీ మేజర్‌గా తెలుగు సినిమాలు ఇండియాలోనే షూట్ అవుతాయి. కేవలం పాటలు లేదా కొన్ని సీన్ల కోసమే అమెరికా వెళ్తారు. అందుకే ఇది చాలా కొద్ది సినిమాలకే ప్రయోజనం కలిగిస్తుంది. అసలు ట్రంప్ లక్ష్యం ఏమిటంటే… హాలీవుడ్ సినిమాలు మళ్లీ అమెరికాలోనే షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ చేస్తూ లాభాలు అమెరికా నుండి పొందటం ఆయనకు నచ్చడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే, తెలుగు సినిమాలు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రంప్ ఈ టారిఫ్ ఎప్పటినుంచి అమలు చేస్తారో, ఎలా చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇది నిజంగా అమలవుతే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇది భారీ షాక్ అవుతుంది.