రైల్వే స్టేషన్లో షూటింగ్ జరిగితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ చాలాకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. దానికి తగ్గట్టే రైల్లోనూ, రైల్వే స్టేషన్స్ లోనూ చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలే కనిపిస్తాయి. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి రైల్వేస్టేషన్ సీనే హార్ట్. వెంకీ, త్రివిక్రమ్‌ల ‘నువ్వు నాకు నచ్చావ్’లోనూ రైల్వే స్టేషన్ సీన్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ ‘ఆదర్శకుటుంబం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో రైల్వేస్టేషన్ సెట్లో జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగివున్న రైలుతోపాటు.. ప్లాట్‌ఫామ్‌పై సీన్ గురించి డిస్కస్ చేస్తున్న వెంకీ, త్రివిక్రమ్‌లను ఈ ఫొటోలో చూడొచ్చు. ఈ సీన్ సినిమాకు కీలకమట. గతంలో వెంకటేశ్ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు.
ఈ సారి ఏకంగా డైరెక్షన్ చేస్తున్నారు. అందరి అంచనాలనూ నిజం చేస్తూ, త్రివిక్రమ్ మార్క్ ఓల్డ్ వెంకీ మామ ఈసారి తెరపై సాక్షాత్కరించడం ఖాయమని తెలుస్తున్నది. సమ్మర్ అనంతరం విడుదలయ్యే ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి కథానాయిక కాగా, హారిక అండ్ హాసిని పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.