క్రాప్ హాలిడే?.. యాసంగి సాగుకు సెలవే!.. చేతులెత్తేసిన రేవంత్ సర్కార్
పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. కరువు వస్తుందని తెలిసినా నీళ్లెత్తక.. ముందస్తు ప్రణాళికల్లేక బేలచూపులు.. రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం.. 235 మండలాల్లో కరువు ఛాయలు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయాన్ని పండుగ చేస్తామనే బూటకపు హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పండగపూట రైతులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యానికి తోడు రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రంలో సాగు సంక్షోభం ముదిరిన సంగతి తెలిసిందే. ఇలాంటి కష్టకాలంలో అన్నదాతకు అండగా ఉండాల్సిందిపోయి, ఒంటరిని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయకుండా నిర్లక్ష్యం వహించింది.
‘దేవుడు కరుణించినా’ అన్నట్టుగా నదుల్లో వరద వచ్చినా ఒడిసిపట్టకుండా సరిదిద్దుకోలేని తప్పుచేసింది. వానకాలం సీజన్ మొదలై, రైతులు పంటలు వేసిన తర్వాత కలెక్టర్లతో కాన్ఫరెన్సులు, శాస్త్రవేత్తలతో మేధోమథనాలు అంటూ నాటకాలు వేసింది. ఫలితంగా వానకాలంలో అన్నదాతలను నిలువునా ముంచింది. ఇప్పుడు ఏకంగా యాసంగి సీజన్‌ను ‘సంపూర్ణ క్రాప్‌హాలిడే’గా ప్రకటించేందుకు సిద్ధమైంది. వరిసాగు వద్దని, బోర్ల కింద ఆరుతడి పంటలు కూడా ఆచితూచి వేయాలని అధికారికంగా ప్రకటించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ముందస్తు కార్యాచరణలోపం
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని మన శాస్త్రవేత్తలతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు సైతం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరువును ముందే అంచనా వేసి, రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ రైతులు రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి, పంటలు వేయగా, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి, బోర్లు అడుగంటే వరకు సర్కార్ మేలొనలేదు. వానకాలంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని తెలిసినా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయనేలేదు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో, సాగునీటి లభ్యతను అంచనా వేయడంలో, నష్టనివారణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైంది. తీరా కాలం ముంచుకొచ్చిన తర్వాత.. వరి సాగు తగ్గించుకోవాలని, ఆరుతడి పంటల వైపు మళ్లాలని హడావుడి చేసింది.
కానీ, అప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేసిన రైతుల సంగతేందో మాత్రం చెప్పలేదు. ఈ వానకాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తకువ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో సాధారణం కంటే తకువ వర్షమే పడింది. 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు చేతికొస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి, సాగుచేసిన రైతులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. ఓవైపు నీటి కొరత వేధిస్తుండగా, మరోవైపు బోర్లలో, బావుల్లో నీళ్లున్నా కరంటు కోతలు, లో వోల్టేజీ సమస్యలతో వాటిని పొలాలకు మళ్లించలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడే ఇలా ఉంటే యాసంగి నాటికి పరిస్థితులు మరింత దారుణంగా దిగజారుతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎల్ నినో పరిస్థితులపై చర్చించాలని, ఆ తర్వాత రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా మాట్లాడాలని భావించింది. వర్షాభావ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్తు సరఫరాపై చర్చించిన అనంతరం, వీడియో కాన్ఫరెన్స్‌లోనే క్రాప్‌హాలిడే నిర్ణయం ప్రకటిస్తారని సచివాలయ వర్గాలు తెలిపాయి. అయితే అదేరోజు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఏఐసీసీ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉన్నది. ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం వారాంతానికి మారనున్నట్టు సమాచారం. ఏదేమైనా చర్చించి తదుపరి కార్యాచరణగా క్రాఫ్హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.
రైతు పెట్టుబడి ఆవిరి
రాష్ట్రంలో సెప్టెంబర్ 9 నాటికి సాధారణంగా 629.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 485.9 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 15 జిల్లాల్లో లోటు 30 శాతాన్ని మించింది. సాగునీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు పొట్టదశకు వచ్చిన వరి పొలాలను పశువుల మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య పంటలదీ ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో తాము సాగుచేసిన పత్తి ఎండిపోతున్నదని రైతులు చెందుతున్నారు. సాధారణంగా ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, కానీ నీటికొరత కారణంగా క్వింటా కూడా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరైంది. సాగునీరు, విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వం ముందే చేతులెత్తేసి ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్లమే కాదని రైతులు చెప్తున్నారు. ఒక పంట సాగు చేయడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. బోరు నీటిపై ఆధారపడితే విద్యుత్తు, మోటర్ల మరమ్మతుల భారం కూడా పెరుగుతుంది. ఇప్పుడు జనరేటర్ల భారం అదనం. పంట ఎండిపోతే పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. భూమి సొంతంగా ఉన్న రైతుతో పోలిస్తే కౌలు రైతు పరిస్థితి దయనీయం. పంట పండకపోయినా కౌలు చెల్లించాల్సిందే. అప్పులపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా ప్రకృతి విపత్తు మాత్రమే కాదని, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన విపత్తు కూడా అని మండిపడుతున్నారు.
నీళ్ల సాక్షిగా నిర్లక్ష్యం
సెప్టెంబర్ 30 నాటికి కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో కలిపి 503.43 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. నిరుడు ఇదే తేదీన 834.92 టీఎంసీల నీరు ఉండగా, ఈసారి నిల్వలు గణనీయంగా తగ్గాయి. కృష్ణా బేసిన్లో 323.37 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 180.06 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు నీటిపారుదల శాఖ నివేదికలు చెప్తున్నాయి. హైదరాబాద్‌కు తాగునీరు అందించే సింగూరు జలాశయంలోనూ నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 9 నాటి నీటి నిల్వల వివరాల ప్రకారం.. సింగూరులో పూర్తిసామర్థ్యం 29,917 మిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా, నిల్వ సుమారు 3,884 మిలియన్ క్యూబిక్ అడుగులకు పడిపోయింది.
పూర్తి సామర్థ్యంలో ఇది 13 శాతం మాత్రమే. మంజీరా జలాశయంలోనూ నిల్వలు తకువగానే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని, వాటిని జలాశయాలకు మళ్లించి నిల్వ చేయాలని బీఆర్ఎస్ నేతలతోపాటు అనేక మంది నిపుణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కానీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో వందలాది టీఎంసీల జలాలు దిగువకు వెళ్లిపోయాయి.
కృష్ణాలోనూ ఇదే తంతు. ఇప్పటికే డ్రైరన్ పూర్తి చేసుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పడావు పెట్టింది. జూరాలకు వచ్చిన జలాలనైనా ఎత్తిపోసిందా? అంటే అదీ లేదు. ఫలితంగా వందల టీఎంసీల కృష్ణాజలాలు దిగువన శ్రీశైలానికి వెళ్లిపోయాయి. వాటిని ఏపీ ప్రభుత్వం కుప్పం వరకు తరలించింది. ఇలా కృష్ణా, గోదావరి జలాల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం బట్టబయలైంది.
శాఖల మధ్య సమన్వయలోపం
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై వివిధ శాఖలకు చెందిన అధికారులు కలిసి చర్చించుకొని ఉంటే మెరుగైన ప్రణాళికను సిద్ధం చేసేవారు. కానీ, ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా తయారైంది. వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లపై ఎకువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజుకు 15 వేల మెగావాట్ల స్థాయిలో ఉండగా, ఈ సీజన్లో పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినట్టు ప్రభుత్వం వెల్లడించిన సమాచారమే సూచిస్తున్నది.
సెప్టెంబర్‌లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎకువసేపు మోటర్లు నడపాల్సి వస్తుండటంతో విద్యుత్తు వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్నది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తును కొనుగోలు చేయడం, ఉత్పత్తిని పెంచడం, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు.
వైఫల్యాన్ని రైతులపైకి నెట్టొద్దు
సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని ప్రభుత్వం కోరే పరిస్థితి రావడమే వ్యవసాయరంగం ఎదురొంటున్న సంక్షోభానికి అద్దం పడుతున్నది. వానకాలంలో పంటలేసిన తర్వాత ప్రభుత్వం నీటికొరత వస్తుందని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ హడావుడి చేసింది. ఇప్పుడు తమ వైఫల్యాన్ని రైతులపైకి నెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు యాసంగిలో వరి సాగు వద్దని చెప్పడం సులభమే కానీ, ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే మడులను సిద్ధం చేయడం, విత్తనాలు, పెట్టుబడులు అవసరం అవుతాయని రైతు సంఘం నేతలు చెప్తున్నారు. కానీ పంట మార్పిడికి సాంకేతిక సలహాలు, విత్తనాల సరఫరా, మారెట్ భరోసా, కనీస మద్దతు ధర, కొనుగోలు వ్యవస్థపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరి వద్దని చెప్పినంత మాత్రాన రైతుకు నష్టం జరగకుండాపోదని, ఆరుతడి పంటలకు మారెట్ లేకపోతే, కొనుగోలు వ్యవస్థ బలంగా లేకపోతే అన్నదాత మరోసారి నష్టపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారం, రుణాల రీషెడ్యూలింగ్, ప్రత్యామ్నాయ పంటలసాయం వంటి చర్యలు తక్షణ అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రవ్యాప్తంగా క్రాప్‌హాలిడే ప్రకటించాలని నిర్ణయిస్తే, సాగు చేయకపోవడం వల్ల రైతులకు కలిగే ఆదాయ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు? కౌలు రైతులను కూడా ఆదుకుంటారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. ఇవేమీ చేయకుండా సాగు విరమణకు పిలుపునిస్తే.. అది ప్రభుత్వ వైఫల్య భారాన్ని రైతులపైకి నెట్టినట్టవుతుందని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
నష్టపరిహారం ప్రకటించాలి: రైతు సంఘం
ఈ నెల 1న క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై చర్చించినట్టు, 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మీడియాకు లీకులిచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ప్రాథమిక నివేదికలు రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం.
ప్రస్తుతం వానకాలానికి సంబంధించి, భవిష్యత్తు యాసంగికి సంబంధించి గానీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని అధికారులే చెప్తున్నారు. ఏ మండలంలో ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి? ఎంతమంది రైతులు తిరిగి విత్తనాలు కొనాల్సి వచ్చింది? ఎంతమంది కౌలు రైతులు అప్పుల ఊబిలో చికుకున్నారు? పంట నష్టానికి పరిహారం ఎంత ఇవ్వాలి? ఆ నిధులు ఎప్పటిలోగా అందుతాయి? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నజ్దిక్‌సింగారం గ్రామానికి చెందిన రైతు కడారి జంగయ్యకు చెందిన పంట ఇప్పటికే కొంత ఎండిపోయింది. ఉన్న కొద్దిపాటి పంటనైనా రక్షించుకునేందుకు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నట్టు జంగయ్య తెలిపాడు.
– యాచారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

