కేసీఆర్ ముద్ర
సురగంగ ఇలను చేరడానికి నాలుగు తరాలు శ్రమించాయి. సగరుడు మొదలుకొని అంశుమంతుడు, దిలీపుడు వేల ఏండ్లు తపస్సు చేశారు. గంగ కదల్లేదు. భగీరథుడు జీవితాన్నే ధారపోశాడు. గంగ అడుగేసింది. శివుడి జటలో ఆగింది. మళ్లీ తపస్సుకు కరిగింది గంగ. దుమికింది గంగ. ఉరికింది గంగ. సాగరాన్ని చేరి.. సగరులకు మోక్షాన్ని ప్రసాదించింది. యుగాలుగా తన పరీవాహకాన్ని సస్యశ్యామలం చేస్తూ గంగమ్మ అనిపించుకుంది.
సురగంగ ఇలను చేరడానికి నాలుగు తరాలు శ్రమించాయి. సగరుడు మొదలుకొని అంశుమంతుడు, దిలీపుడు వేల ఏండ్లు తపస్సు చేశారు. గంగ కదల్లేదు. భగీరథుడు జీవితాన్నే ధారపోశాడు. గంగ అడుగేసింది. శివుడి జటలో ఆగింది. మళ్లీ తపస్సుకు కరిగింది గంగ. దుమికింది గంగ. ఉరికింది గంగ. సాగరాన్ని చేరి.. సగరులకు మోక్షాన్ని ప్రసాదించింది. యుగాలుగా తన పరీవాహకాన్ని సస్యశ్యామలం చేస్తూ గంగమ్మ అనిపించుకుంది. ఒక కార్యం కట్టుదిట్టం కావాలంటే ఇదిగో తరతరాలు నిష్ఠగా పరిశ్రమించాలి. అవసరమైతే విక్రమించాలి. స్వతంత్య్రోద్యమమూ అంతేకదా! సిపాయి తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా దాకా ఎన్ని దశలు దాటింది. అంతెందుకు ; మన తెలంగాణ ఆవిర్భావమే చూసుకుందాం. తరతరాల అకుంఠిత ఆకాంక్షను, దశాబ్దాల దమ్మున్న పోరాటాన్ని అద్భుత వ్యూహ రచనతో ఒక కొలిక్కి తెచ్చింది. భగీరథ ప్రయత్నంతో తెలంగాణను సాధించింది మన ఉద్యమ కేసరి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
రాష్ట్రం సాకారమైంది. తర్వాత ఏమిటి? కేసీఆర్ ముందున్న అసలైన సవాలు తెలంగాణను తనదైన స్వరూపంలో పునర్నిర్మించడం. తొలకరి పలకరించగానే పుడమి పులకరించి పరిమళించినట్టు.. పువ్వు పుట్టగానే తావి విరజిమ్మినట్టు.. అప్పుడే పుట్టిన తెలంగాణ పరిఢవిల్లాలంటే ఏదో చేయాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి?? 2001లో ఉద్యమాన్ని తలకెత్తుకున్ననాడే ఈ ప్రశ్నలకు కేసీఆర్ మస్తిష్కంలో జవాబులు రాసి పెట్టుకున్నారు. సంక్షేమంలో ఏ పంథా అనుసరించాలో రాష్ట్రం వచ్చిన నాడే నిశ్చయించుకున్నారు. సంస్కరణల్లోనూ అదే వేగం ప్రదర్శించారు. బిడ్డ పుట్టిన ఆరు నెలల ఆరు రోజులకు అన్నప్రాశన చేయడం మన సంప్రదాయం. రాష్ట్ర పునర్విభజన జరిగిన ఆరు మాసాల్లోపే.. జిల్లాల పునర్విభజన ఘట్టానికి తెరలేపారు కేసీఆర్. ప్రజలకు దూరమైన ప్రభుత్వాన్ని వారి ముంగిటకు తీసుకురావాలి. దశాబ్దాలుగా పేరుకుపోయిన పరిపాలన భారాన్ని దించాలి. ఈ ఆలోచనల నుంచే పుట్టుకొచ్చిన కీలక సంస్కరణ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ.
అప్పటి దాకా ఆసిఫాబాద్ గూడేలను ఎవరు పలకరించారు.. సీజనల్ రోగాలు తప్ప! పదేండ్ల కిందటి వరకు ములుగులో ఏమున్నయి.. ఆకలి దప్పులు తప్ప! అన్నాళ్లూ భూపాలపల్లి ఏం పాపం చేసిందని.. అభివృద్ధికి దూరమైంది! ఒక ధ్రువపత్రం కోసం, భూమి సమస్య పరిష్కారం కోసం, రెవెన్యూ వ్యవహారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటేనే ఒక రోజంతా పోయే పరిస్థితి! ఉమ్మడి మెదక్ జిల్లానే ఇందుకు చక్కని ఉదాహరణ. జిల్లా పేరు మెదక్ అయినా పరిపాలన కేంద్రం సంగారెడ్డిలో ఉండేది. సిద్దిపేట వంటి ప్రాంతాల ప్రజలు జిల్లా స్థాయి పనుల కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేది. పేరొక ప్రాంతానిది. పాలనా కేంద్రం మరోచోట.. ప్రజల అవసరాలు ఇంకోచోట! ఇలా చెబుతూ పోతే… కలిమి లేక కుమిలిపోయిన ప్రాంతాలెన్నో! జిల్లా కేంద్రం దాకా పయనానికే నానా అగచాట్లు పడుతూ, దశాబ్దాలపాటు కలెక్టర్‌ను ఎన్నడూ కండ్లతో చూడని ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసి, అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో జిల్లాల పునర్విభజన చేపట్టారు కేసీఆర్.
ప్రభుత్వం ప్రజల దగ్గరకు రావాలా? లేక ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలా? స్వతంత్ర భారతంలోనూ సామాన్యుడిని వేధించే మౌలిక ప్రశ్న ఇది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పాలనా వ్యవస్థే వారికి సమస్యగా మారకూడదన్న ఆలోచనే చిన్న జిల్లాల ఏర్పాటుకు మూలం. ప్రజాస్వామ్యంలో పాలన అంటే కేవలం కార్యాలయాలు, అధికారులు, ఫైళ్లు కాదు. సామాన్యుడికి అందుబాటులో ఉండే సేవలు.. సకాలంలో జరిగే పనులు.. తన సమస్యను చెప్పుకొనే అవకాశం! తెలంగాణను సాధించడం ఒక ఎత్తు అయితే, సాధించుకొన్న తెలంగాణకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన రూపాన్ని ఇవ్వడం మరో ఎత్తు.
పాత ఉమ్మడి జిల్లాల వ్యవస్థను యథాతథంగా కొనసాగించడం సులభమే. కానీ, సులభమైన దారిని ఎంచుకోవడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కొత్త మార్గాన్ని నిర్మించడానికే కేసీఆర్ ప్రాధా న్యం ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే కేవలం జిల్లాల సంఖ్య పెంచడం కాదు. ప్రభుత్వ యంత్రాగాన్ని ప్రజలకు చేరువ చేయడానికి చేపట్టిన మహోద్యమం. జిల్లాలను విభజించడం అంటే మ్యాప్‌పై గీతలు గీయడం కాదు. తెలంగాణ వైవిధ్యాన్ని గుర్తించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలనను పునర్వ్యవస్థీకరిస్తూ దూరదృష్టితో తీసుకొన్న నిర్ణయం.
ఈ ఆలోచన అంతకు ముందు పాలకులకు ఎన్నడూ రాలె! ఉమ్మడి రాష్ట్రంలో సగటున పదివేలకు పైగా చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న జిల్లాల్లో పొలిమేర దాకా పాలన ఎన్నడూ అందలేదు. జిల్లా స్థాయి అధికారులు సైతం తమ ఉద్యోగ జీవితంలో తొక్కి చూడని ప్రాంతాలు కోకొల్లలు ఉండేవి. ఈ పరిస్థితి తెలంగాణలో ఉండకూడదు అనుకున్నారు కేసీఆర్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యానికి పూనుకున్నారు ఆయన. జిల్లాల విభజన అని కేసీఆర్ అన్నప్పుడు.. చాలామంది పెదవి విరిచారు.
అయ్యే పనేనా అని నిట్టూర్చారు. ఇవన్నీ కేసీఆర్‌కు జాన్తా నై! తను సాధించిన తెలంగాణను అందరికీ అందనంత ఎత్తులో నిలబెట్టడమే ఆయన లక్ష్యం. అందుకే వడివడిగా అడుగులు వేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణే కీలకమైన మలుపు. అలాగని దాన్ని అమలు చేయడంలో మరీ వేగం ప్రదర్శించలేదు. చర్చలు, సంప్రదింపులు, సలహాలు, సమాలోచనలు, సుదీర్ఘ లక్ష్యాలు, సమున్నత విజయాలు దృష్టిలో ఉంచుకొని.. ఏడాదిన్నరపాటు సమగ్రమైన విశ్లేషణలు కొనసాగించారు. ప్రజామోదంగా పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ముహూర్తం నిర్ణయించారు. తెలంగాణ విజయానికి సుముహూర్తం అది. విజయ దశమి నాడు తెలంగాణ దిగ్విజయ ప్రస్థానం మొదలైంది. ఆ సంస్కరణ కేసీఆర్ మేధో లిఖితం. జిల్లాల పునర్విభజన అందించిన ఫలితం చరిత్రలో లిఖించదగిన అద్భుతం. కేసీఆర్ అప్పుడు పూనుకోకపోతే.. ఇప్పటికీ తెలంగాణ పది జిల్లాలతోనే ఉండేది.
దేశంలోని వివిధ రాష్ర్టాల చరిత్రను పరికిస్తే.. కేసీఆర్ ఎంత దూరదృష్టితో ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థమవుతుంది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. 1950లో ఏర్పడిన ఈ రాష్ట్రంలో 54 జిల్లాలు ఉండేవి. 20 ఏండ్ల తర్వాత ఒక జిల్లాను పెంచుకున్నారు. రెండేండ్లకు, మూడేండ్లకు, పుష్కరకాలానికి ఒక్కో జిల్లాను పెంచుకుంటూ పోయారు. ఉత్తరాఖండ్ విడివడిన తర్వాత 57 జిల్లాలుగా మిగిలింది. తర్వాత ఎనిమిదేండ్లకు గానీ పూర్తిస్థాయి జిల్లాల పునర్విభజన జరగలేదు. అది కూడా 57గా ఉన్న జిల్లాలను 71కి పెంచుకున్నారు. 2011లో వాటిని 75 చేసుకున్నారు.
అభివృద్ధి పథంలో ఉత్తర్‌ప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నదో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. 17 జిల్లాలతో ఏర్పడిన గుజరాత్ 24 జిల్లాలుగా మారడానికి 37 ఏండ్లు పట్టింది. 34 జిల్లాలుగా రూపుదిద్దుకోవడానికి సుమారు మరో 16 ఏండ్లు గడిచాయి. ఈ దృష్టాంతాలన్నీ కేసీఆర్‌కు ఎరుకే! అందుకే, సంక్షేమాన్ని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారో, సంస్కరణలనూ అంతే వేగంగా చేపట్టారు. తెలంగాణ సాకారమయ్యాక రెండేండ్లకే 2016 అక్టోబర్ 11న 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల రాష్ట్రంగా మలిచారు. ప్రజాభిప్రాయాన్ని, పాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2019 ఫిబ్రవరి 17న నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రకటించి.. ముచ్చటగా 33 జిల్లాల తెలంగాణగా రాష్ర్టాన్ని నిలబెట్టారు.
తెలంగాణ ఉద్యమం కేవలం భౌగోళిక సరిహద్దుల కోసం సాగలేదు. అది ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలన కోసం సాగింది. జిల్లాల పేర్లలో ఈ చరిత్రకు చోటు కల్పించడం ద్వారా రాష్ట్ర అస్తిత్వాన్ని పరిపాలన నిర్మాణంలో నూ ప్రతిబింబించే ప్రయత్నం జరిగింది. జిల్లాల పేర్లలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమ వారసత్వానికి చోటు కల్పించడం ఈ ప్రక్రియలో మరో విశిష్ట అంశం. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఆదివాసీ పోరాట చరిత్రను గుర్తు చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి పేరు తెలంగాణ భావజాల వ్యాప్తికి పునాదులు వేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను స్మరింపజేస్తుంది. యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం వంటి పేర్లు ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రాంతీయ వారసత్వాలను ప్రతిబింబిస్తాయి.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఆశించింది కేవలం కొత్త రాష్ట్రం కాదు. తమ సమస్యలను అర్థం చేసుకునే ప్రభుత్వం, తమ ప్రాంతాన్ని గుర్తించే పరిపాలన, తమకు అందుబాటులో ఉండే అధికార యంత్రాంగం. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఈ ఆకాంక్షలకు కట్టిన పట్టం. జిల్లాలు ప్రకటించి ఊరుకుంటే తెలంగాణ పటంలో సరిహద్దులు మారేవంతే! అభివృద్ధిలో హద్దులు చెరిపేసేలా పాలనలోనూ పటిమ కనబర్చారు కేసీఆర్. జిల్లాకు ఉండాల్సిన హంగులన్నిటినీ త్వరితగతిన సమకూర్చారు. జిల్లా కేంద్రం దగ్గరవ్వడం అంటే.. అభివృద్ధి ముంగిట్లోకి రావడమే అన్న నానుడి పుట్టించారు.
అందుకు నిదర్శనమే.. జిల్లాల ఆవిర్భావం నుంచి ఎనిమిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి. తలసరి ఆదాయం నుంచి జీఎస్డీపీ వరకు అన్నిటా పురోగతి సాధించిన కాలమది. పాలన ప్రజల చెంతకు చేరడంతో చింతలు పలాయనం చిత్తగించాయి. మిషన్ భగీరథ నీళ్లలా నిత్యం జిల్లా స్థాయి అధికారి ఎవరో ఒకరు.. ప్రతి పల్లెనూ పలకరించడం మొదలైంది. క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు చేరాయి. వాటికి అప్పటికప్పుడు పరిష్కారాలు దొరికాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ ఆవిర్భావం దశాబ్దాల కోరిక. జిల్లాల పునర్విభజన కేసీఆర్ అడగకుండానే మనకిచ్చిన వరం. రెండూ చరిత్రలో సూర్య చంద్రులున్నంత కాలం తెలంగాణను ప్రగతి పథంలో నిలబెట్టినవే!! తెలంగాణ ఉన్న ంతకాలం కేసీఆర్ పేరును నిలబెట్టి ఉంచేవే!!!

Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

