వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ సందర్భంగా వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి తీయించుకున్న ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
‘20 నెలల విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. మనందరి ఫేవరేట్ హీరో వెంకటేష్‌తో చేతులు కలిపారు’ అని నాగవంశీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. ఈ సినిమాల్లోని సంభాషణలు ప్రధానాకర్షణగా నిలిచాయి. దీంతో వీరిద్దరి తాజా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో కథానాయికలుగా త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.