అల్లు అర్జున్, అట్లీ సినిమా ఖరారైపోయింది. ప్రకటన కూడా వచ్చేస్తున్నది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ చేతులు కలుపుతారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ సినిమా అంటే.. వందలకోట్ల పైమాటే. సినిమా హిట్ అయితే.. వసూళ్లు వెయ్యికోట్ల పైమాటే. దానికి తగ్గట్టే నిర్మాణానికి కూడా టైమ్ తీసుకుంటారు. ఏడాదికి పైనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంటే.. ఏడాదికి పైగా బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిందే. అందుకే.. మధ్యలో ముచ్చటగా ఓ సినిమా చేసేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారట త్రివిక్రమ్.
ఇటీవలే తమిళ హీరో ధనుష్‌కి ఓ కథ వినిపించారట. ఆయనక్కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది. త్వరలోనే త్రివిక్రమ్, ధనుష్ సినిమా మొదలు కానున్నట్టు సమాచారం. టాలీవుడ్‌కి చెందిన ఓ భారీ నిర్మాణ సంస్థే ఈ సినిమా నిర్మిస్తుందట. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన ‘ఇడ్లీ కడై’ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే.. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నటించిన ‘కుబేర’ సినిమా సమ్మర్లోనే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాల పనిని పూర్తి చేసుకొని త్రివిక్రమ్ సినిమా సెట్లోకి ఎంట్రీ ఇస్తారట ధనుష్.