సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అగ్ర నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త ట్రెండింగ్‌లో నిలిచింది. సోమవారం త్రిష పుట్టినరోజు కూ డా. అయితే ఆమె దళపతి విజయ్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ తిరుమలను సందర్శించిందని, ప్రత్యేక పూజలు కూడా చేసిందనే మాటలు వినిపించాయి.
తిరుమల దర్శనానంతరం త్రిష నేరుగా చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు అందజేసింది. ఆమె విజయ్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె దాదాపు గంటన్నర పాటు విజయ్‌తో కలిసి చర్చించారు. విజయ్ ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో త్రిష విక్టరీ సింబల్‌ను చూపిస్తూ ఉత్సాహంగా కనిపించింది. ఈ నేపథ్యంలో విజయ్-త్రిష వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధం గురించి మరోమారు జోరుగా చర్చలు మొదలయ్యాయి.
‘గిల్లి’ చిత్రంలో తొలిసారి విజయ్-త్రిష జోడీ కట్టారు. అది సూపర్‌హిట్ అయింది. వారిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో ‘ఆప్పాడి పోడు’ పాట కల్ట్క్లాసిక్గా మిగిలిపోయింది. ‘గిల్లి’ తర్వాత తిరుపాచి, ఆథీ, కురివి వంటి చిత్రాల్లో త్రిష-విజయ్ నటించారు. ‘కురివి’ (2008) తర్వాత దాదాపు 15 ఏళ్లు వీరి కాంబినేషన్‌కు బ్రేక్‌పడింది. మళ్లీ ఈ జంట ‘లియో’ (2023) చిత్రంలో భార్యభర్తలుగా నటించారు. ‘ది గోట్’ చిత్రంలో త్రిష ఓ పాటలో అతిథిగా కనిపించింది.
కొద్దినెలల క్రితం విజయ్ భార్య సంగీత తన విడాకుల పిటిషన్లో త్రిష పేరును ప్రస్తావించడం, ఆమె కారణంగానే తమ వైవాహిక బంధంలో మనస్పర్థలు తలెత్తాయని చెప్పడంతో ఒక్కసారిగా త్రిష-విజయ్ బంధం గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులు కొందరు త్రిష పేరును ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ముందు ఓ వివాహ వేడుకకు విజయ్-త్రిష కలిసి వెళ్లడంతో వారి రిలేషన్షిప్ గురించి మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ జంట తమ అనుబంధం గురించి ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. మీడియా వారు ప్రశ్నించిన అనేక సందర్భంలో తాము మంచి మిత్రులమని సమాధానమిస్తుంటారు.
విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో త్రిషకు సంబంధించిన బాధ్యతలపై సోషల్‌మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది. ప్రభుత్వంలో త్రిషకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతున్నది. విజయ్ రాజకీయ వ్యూహాల్లో త్రిష తెరవెనుక సహాయసహకారాలు అందించిందని చెబుతారు. దాంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిషకు సముచిత స్థానం కల్పించే యోచనలో పార్టీ ఉందని అంటున్నారు. తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి వెస్ట్ నియోజక వర్గాల్లో విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. అందులో ఓ నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి త్రిషను పోటీకి దించే అవకాశం ఉందని సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.