అది ఓ అందమైన హిల్ స్టేషన్. అందులో హాయిగా జీవితాన్ని సాగించే ఓ కుర్రాడు. అతని జీవితంలో తుఫాన్ లాంటి ఊహించని విధ్వంసం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి ఆ కుర్రాడెలా బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘తుఫాన్ హెచ్చరిక’. ‘When time locks all your doors, destiny brings you the key’ అనేది ఉపశీర్షిక. రాఖీ, సుహానా ముద్వారి జంటగా నటిస్తున్నారు. జగదీశ్ కె.కె. దర్శకుడు.
డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ నిర్మాతలు. ‘ఇది కేవలం ఒక కథ కాదు. ఒక జీవితం. లంబసింగి, చింతపల్లిలోని మంచుతో కూడుకున్న పచ్చని కొండలు, అద్భుతమైన ప్రకృతి నేపథ్యంలో సాగే కథ ఇది. మంచు సీజన్లో కొంత చిత్రీకరణ జరిపాం. సీజనల్ వేరియేషన్స్ రాకుండా, మళ్లీ ఏడాది పొడవునా వేచి వుండి మిగతా సీన్స్ చిత్రీకరించాం. ఆ ఫలితం రేపు వెండితెరపై చూస్తారు.’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.నాయుడు, మాటలు: అరుణ్వీర్, సమర్పణ: సరయు తలశిల, నిర్మాణం: శ్రీపాద క్రియేషన్స్.