నల్లగొండ, జనవరి 08 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 19న జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి పంపే వినతి పత్రంపై ఎఫ్సీఐ గోదాం హమాలీలతో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్ల అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విబి-జి రామ్ జి చట్టం, బీమా రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి, అణు రంగంలోకి ప్రవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ చేసిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక, రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసిందన్నారు. ఒక వైపున ప్రజా సంక్షేమం వల్లిస్తూనే బీజేపీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్ముతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలతో నల్లగొండ జిల్లాలో ఉన్న కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఎక్కువ మంది రైతాంగం విద్యుత్ పంపుసెట్లతోనే సేద్యం చేస్తున్నట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికులకు కొత్త చట్టంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ముడిపెట్టడంతో వారు నిధులు కేటాయించకుంటే మరిన్ని పని దినాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు.
ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజన చేయడంతో పని గంటలు పెరగడం, కనీస వేతనం, సంక్షేమం, సామాజిక భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే పార్లమెంట్లో చేసిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు పల్లె నగేశ్, ఎఫ్సీఐ హమాలీ యూనియన్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, పాలకూరి సైదులు, నకరికంటి సత్తయ్య, వట్టిపల్లి వెంకన్న, నాగయ్య, గణేశ్, రాములు పాల్గొన్నారు.