RSS in Tollywood | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అవ్వడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. జనవరి 31 శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున, నాని, తేజ సజ్జా, రానా దగ్గుబాటి, వరుణ్ తేజ్ మరియు రామ్ పోతినేని వంటి అగ్ర హీరోలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ మరియు సాహు గారపాటి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని సినీ పెద్దలు చెబుతున్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ సమావేశం వెనుక ‘హిందుత్వ ఎజెండా’ను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కుట్ర ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశభక్తి పేరుతో ‘కాషాయ ప్రాపగండా’ చిత్రాలను రూపొందించేలా టాలీవుడ్‌ను ప్రభావితం చేయడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’,’రజాకార్’ వంటి చిత్రాలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఇప్పుడు సౌత్ సినిమా మార్కెట్‌ను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని సంఘ్ పరివార్ చూస్తోందనే వాదన వినిపిస్తోంది. భావజాల వ్యాప్తి కోసం కళాకారులను, సినిమా రంగాన్ని పావులుగా వాడుకోవడం సరికాదని, ఇది ఇండస్ట్రీలోని సృజనాత్మకతను దెబ్బతీస్తుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం సినిమాలను రూపొందిస్తే అది సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ భగవత్ ఈ భేటీని మర్యాదపూర్వక కలయికగా అభివర్ణించినప్పటికీ, స్టార్ హీరోలు ఇలాంటి వివాదాస్పద సంస్థలతో చర్చలు జరపడం వారి తటస్థ వైఖరిని ప్రశ్నిస్తోందని విమర్శకులు ఎండగడుతున్నారు. ఇక ఈ భేటీ టాలీవుడ్ భవిష్యత్తు ప్రాజెక్టుల ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.