బొమ్మ పడిందని తెలిస్తే ఎన్ని పనులున్నా అభిమానులు థియేటర్లకు పరుగు లంకించకుండా ఉండలేరు. తమ అభిమాన హీరో, హీరోయిన్ సినిమాను అందరి కన్నా ముందుగా చూడాలన్న తాపత్రయం వారిలో ఎన్నడూ తగ్గదు. ఈ వేసవిలో సినిమాలకు ఉండే ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మూవీ మేకర్స్ పోటాపోటీగా సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి వేసవి చిత్రాలు సినీప్రియులు ఆశించినంతగా రావడం లేదు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు.. వేసవిలో ప్రత్యేకంగా వినోదం పంచుతారని భావించి భంగపడ్డ అభిమానులే ఎక్కువ. భారీ బడ్జెట్ సినిమాల విడుదల వాయిదా పడటానికి కారణమేంటి..? ఈ వేసవి బొమ్మ విశేషాలేంటి..? చదివేయండి.
Tollywood | ఈ ఏడాది వేసవి కాస్త ముందుగానే వచ్చేసింది. రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించేశారు. చదువు, పరీక్షలు, ట్యూషన్ల టెన్షన్ నుంచి పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులకు కూడా కాస్త రిలీఫ్ దొరికే చక్కని సమయం. ఇంకేముంది.. వేసవి సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలనే ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నారు పిల్లలు.
థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను వరుస పెట్టి చూస్తూ ఎంజాయ్ చేయడమే. మరి ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, సిరీస్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక, సంక్రాంతి పండుగ తర్వాత వేసవి మార్కెట్‌పైనే ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతోపాటు కాస్త పెద్ద హీరో సినిమాలు వేసవిలో రిలీజ్ చేయడానికి మక్కువ చూపిస్తారు. ఈ సమయంలో అయితే ఓపెనింగ్స్ బాగుంటాయని భావిస్తారు. నిజానికి వేసవిలో విడుదలయ్యే సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ బాగుంటాయి కూడా.
ఈ వేసవి కాస్త భిన్నంగా ఉండబోతున్నది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల హడావుడి షురూ కావడంతో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఈ వేసవిలో విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ వాయిదా పడింది. ఏమైనా ఈ వేసవిలో సినీ ప్రేక్షకులకు వినోదం పంచుతామంటూ విడుదలకు సిద్ధమైన సినిమాలేంటో తెలుసుకుందాం..
ప్రతినిధి 2
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ సెటైరికల్ ‘ప్రతినిధి-2’. కొన్నాళ్లుగా నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ‘ప్రతినిధి-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. ఏప్రిల్ 25న ‘ప్రతినిధి-2’ సినిమా విడుదలకానున్నది.
మనమే
శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మనమే’. ఫ్యామిలీ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై దాసరి టీజీ విశ్వప్రసాద్ ‘మనమే’ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఆ ఒక్కటీ అడక్కు..
అల్లరి నరేశ్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత పూర్తి వినోదాత్మక చిత్రంలో నరేశ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 3వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో రాజేంద్రప్రసాద్ నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఆ సినిమాకు ఇది సీక్వెల్ కాదని, అసలు ఆ కథకు ఈ సినిమా కథకు ఎలాంటి సంబంధమూ లేదని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే, సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తున్నది.
జితేందర్‌రెడ్డి
‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ వంటి ఫీల్‌గుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విరించి వర్మ దర్శకుడిగా తెరకెక్కించిన మరో సినిమా ‘జితేందర్‌రెడ్డి’. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో రాకేశ్ వర్రె లీడ్‌రోల్ చేశారు. 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సుబ్బరాజు, రవిప్రకాశ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మే 3న ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
‘మాస్కా దాస్’ విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా చేస్తున్నది. హీరోయిన్ అంజలి, సాయికుమార్, నాజర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి స్పెషల్ అప్పియరెన్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నది. ‘రౌడీ ఫెలో’, ‘చల్ మోహన రంగ’ సినిమాలు తెరకెక్కించిన రైటర్ కృష్ణ చైతన్య.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 17వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ‘గామి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్… ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో అభిమానులను అలరించనున్నాడు. టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
వీటితోపాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా వేసవిలో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. ఇక, థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన సినిమాలు సైతం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కాగా, పెద్ద హీరోల సినిమాల విడుదల లేకపోవడంతో ఈ వేసవికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సందడి లేదు.
ఒక పక్క ఎన్నికలు, మరోపక్క ఐపీఎల్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడుతున్నది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నది. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.వాస్తవానికి ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే పలు కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇక, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది.
ఎన్నికల అనంతరం వీటి విడుదల తేదీలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.