Tollywood | టాలీవుడ్ ప్రస్తుతం ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫిలిం ఫెడరేషన్ పిలుపు మేరకు, కార్మికులు 30 శాతం వేతన పెంపుపై స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి షూటింగ్లకు హాజరుకావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం కారణంగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, చెన్నై, ముంబై నుంచి కార్మికులను తీసుకువచ్చి షూటింగ్లను కొనసాగిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ, అందులో ఎంతవరకు నిజముందో మాత్రం స్పష్టత లేదు.
ఈ సమ్మె ప్రభావంతో చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్కు బ్రేక్ పడే అవకాశముంది. ప్రస్తుతం సినిమా కీలక దశలో ఉండగా, షూటింగ్ ఆగిపోవడం వల్ల కాల్షీట్లు వృథా అయ్యే ప్రమాదం ఉంది. దీంతో బడ్జెట్ పెరుగుదల, రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ-2: తాండవం’ షూటింగ్ చివరి దశలో ఉంది. దసరా విడుదల లక్ష్యంగా మేకర్స్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమాకు కూడా ఈ సమ్మె ఆటంకంగా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ భారీ సెట్లో జరుగుతోంది. ఇందులో పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరం కాగా, ఇప్పుడు సమ్మె కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. దీనివల్ల సినిమాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది.. అలానే ‘ఆంధ్రాకింగ్ తాలూకా’, ‘సంబరాల ఏటిగట్టు’, ‘తెలుసు కదా’, ‘డెకాయిట్’ వంటి అనేక చిత్రాల షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందో అనే అనిశ్చితి ఇండస్ట్రీని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఫిలిం ఫెడరేషన్ – నిర్మాతల మండలి మధ్య చర్చలు ఎప్పుడు జరుగుతాయో, వాటి ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది . మొత్తంగా చూసుకుంటే , ఈ సమ్మె తాత్కాలికంగా అయినా టాలీవుడ్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.