కల్కి కుమ్మేసింది.. అయినా నో హ్యాపీ! పుష్ప-2 ఇరగదీసింది.. స్టిల్ ఏదో అసంతృప్తి! 2024లో ఇంటర్నేషనల్ లెవల్లో టాలీవుడ్ సత్తా చాటింది. బట్.. లోకల్‌గా మాత్రం ఏదో వెలితి. రెండురెండ్ల నాలుగు.. ఇలా పర్ఫెక్ట్ ఈక్వేషన్‌తో ఎంట్రీ ఇచ్చిన 2024 కూడా లోటుగానే ఫీలవుతున్నది! ఎందుకంటే.. మెగాస్టార్ టైమింగ్‌ను చవిచూడలేకపోయానే అని బాధ! బాలయ్య బాబు తొడగొట్ట కుండానే తనకు కాలం చెల్లిపోయిందని ఆవేదన! కాలానిదే కాదు.. సగటు ప్రేక్షకుడి ఫీలింగ్ కూడా ఇదే!!
Tollywood | తెలుగు సినిమా మూడో తరం ముచ్చట చిరంజీవి, బాలకృష్ణ. ఎనర్జీ లెవల్స్‌లో ఇద్దరూ ఇద్దరే! యాక్షన్‌లో ఒకరిని మించి మరొకరు రఫ్ఫాడించే బాపతు!! అడపాదడపా ఇంగ్లిష్ ఇయర్ ప్రారంభంలో వచ్చే సంక్రాంతికి ఇద్దరూ పోటాపోటీగా బరిలో దిగేవాళ్లు. ఎవరి సత్తా వాళ్లు చాటుకునేవాళ్లు. ప్రేక్షకులు పండుగ చేసుకునేవాళ్లు. 2023 సంక్రాంతికి కూడా ‘వాల్తేరు వీరయ్య’గా చిరు అలరిస్తే, ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య బాబు రికార్డులు సృష్టించాడు. ఆ ఏడాది ఇద్దరూ చెరో రెండు సినిమాలు చేసి ప్రేక్షకులకు ఫీస్ట్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్.. ‘భోళా శంకర్’గా ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ‘భోళా..’ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతికి విజయం అందుకున్న బాలకృష్ణ 2023 ద్వితీయార్ధంలో ‘భగవంత్ కేసరి’గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు రెండేసి సినిమాలు చేసి ఆ సంవత్సరాన్ని అపురూపంగా మార్చేశారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ, చిరు జోరుకు బ్రేకులు పడ్డాయి. మూడు నెలల్లో షూటింగ్ పూర్తిచేసే సంప్రదాయం పాటించే బాలకృష్ణ కూడా 2024పై శీతకన్ను వేశాడు. వారిద్దరి సినిమాలు ఈ ఏడాది సెట్స్‌కే పరిమితమయ్యాయి. దీంతో ఈ సంవత్సరం చిరు సందడి, బాలయ్య వీరంగం లేకుండా ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
కాలం విలువైనది. నిర్మాత మేలుకోరే నటులుగా పేరున్న చిరంజీవి, బాలకృష్ణకు ఇలా కాలాన్ని కర్పూరంలా కరిగించడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ, అదే నిర్మాత క్షేమం కోసం, ఇండస్ట్రీ బాగు కోరి కాస్త లేట్‌గా అయినా లేటెస్ట్గా వద్దామని ఫిక్సయ్యారు. దాని ఫలితంగానే 2024లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒక్కటంటే ఒక్కటీ విడుదల కాలేదు. ఒక్కో సినిమా రెండేండ్ల పాటూ చిత్రీకరిస్తున్న ఈ రోజుల్లో ఏడాది గ్యాప్ రావడం పెద్ద విషయం కాదు. గతంలోనూ ఈ ఉభయ హీరోల సినిమాలు విడుదల కాని సంవత్సరాలు ఉన్నాయి. చిరంజీవి రాజకీయ రంగప్రవేశం తర్వాత దాదాపు తొమ్మిదేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో.. మెగా అభిమానులు తెగ సంబురపడిపోయారు. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బ్రేక్‌లు ఇస్తుండటంతో పెదవి విరుస్తున్నారు.
2017లో ‘ఖైదీ నెంబర్ 150’తో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనిపించుకున్నాడు చిరంజీవి. కానీ, ఆ మరుసటి ఏడాది ఆయన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. మళ్లీ 2019లో ‘సైరా నరసింహారెడ్డి’గా ప్రేక్షకులను అలరించాడు. హిట్ జాబితాలో చోటు దక్కించుకున్నా.. సగటు ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని అంతగా ఆదరించలేదనే చెప్పాలి. తర్వాత ఒకటి కాదు.. వరుసగా రెండేండ్లు మెగా అభిమానులకు నిరాశే ఎదురైంది. 2020, 2021లో చిరు సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఈ గ్యాప్‌ను పూడుస్తూ 2022లో చిరంజీవి జంట సినిమాలతో అలరించాడు. ‘ఆచార్య’లో అదిరిపోయే స్టెప్పులేసి చిరు ఆల్వేస్ మెగాస్టార్ అని నిరూపించాడు. అయితే, కొరటాల, చిరంజీవి, రామ్‌చరణ్ లాంటి భారీ కాంబోలో నిర్మించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వాటిని అందుకోలేక ‘ఆచార్య’ పరాజయం పాలైంది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని అదే ఏడాది రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ కొంతవరకు పూడ్చగలిగింది. హీరోయిన్ లేకుండా, పాటలు, స్టెప్పులు లేకుండా చిరంజీవి కంటిచూపుతో నడిపించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌తో 2023లో మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు చిరంజీవి. ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అప్పుడెప్పుడో ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు రేంజ్ మాస్ మసాలా పంచడంతో.. చిరు అభిమానుల్లో పూనకాలు లోడయ్యాయి. తర్వాతి సినిమా ‘భోళా శంకర్’ ఢమాల్ కావడంతో మెగాస్టార్ డైలమాలో పడ్డాడేమో.. ఆచి.. తూచి.. అడుగు వేయాలని ఫిక్సయ్యాడు. దీంతో 2024లో సెట్స్‌కే పరిమితమయ్యాడు.
‘బింబిసార’ ఫేమ్ మల్లాది వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’.. ఈ ఏడాది శరవేగంగా షూటింగ్ జరుపుకొన్నది. 2025 సంక్రాంతికే విడుదల అవుతుందని అనుకున్నా.. ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే, వచ్చే ఏడాది చిరంజీవి మరో సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో మెగాస్టార్ ఓ సినిమా ఓకే చేశాడు. ఇప్పటికింకా షూటింగ్ మొదలుకాకున్నా.. వచ్చే ఏడాదే ఇది రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. మొత్తం మీద 2024లో ప్రేక్షకులను పలకరించని చిరు.. వచ్చే ఏడాది రెండు సినిమాలతో పండుగ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సరైన హిట్ పడక అక్కినేని హీరోలు కాస్త వెనుకంజలో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ విడుదలైంది. అయితే, ఆశించిన విజయం సాధించలేకపోయింది. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘కుబేర’ సినిమా డిసెంబర్ 31న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక నాగ్ తనయులు నాగ చైతన్య, అఖిల్ సినిమాలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రాలేదు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో రూపుదిద్దుకున్న ‘తండేల్’ ఈ ఏడాదిలోనే రావాల్సింది. అయితే, ఆ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
మరోవైపు 2023లో ‘ఏజెంట్’గా పలకరించిన అఖిల్ 2024లో వెండితెరకు ముఖం చాటేశాడు. ‘ఏజెంట్’ భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆయనకు గ్యాప్ తీసుకోక తప్పింది కాదు. అఖిల్ తర్వాతి సినిమాపై ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు. వచ్చే సంవత్సరం ఏమవుతుందో చూడాలి.
బాలకృష్ణ కథ ఓకే అన్న తర్వాత గరిష్ఠంగా ఆరు నెలల్లో సినిమా విడుదల కావడం ఖాయం. కానీ, ఈ ఏడాది ఆ సంప్రదాయానికి మంగళం పాడాడు బాలయ్య. 2024లో ఆయన సినిమాలు రెండు సెట్స్ మీద సందడి చేసినా.. తెర మీదికి మాత్రం రాలేదు. 2014 నుంచి 2019 వరకు ఏటా కనీసం ఒక్కటైనా బాలయ్య సినిమా విడుదలైంది. 2019లో అయితే ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలతోపాటు ఆ ఏడాది ‘రూలర్’గా అభిమానులను అలరించాడు. 2020లో బాలకృష్ణ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
మళ్లీ 2021లో ‘అఖండ’ విజయం సొంతం చేసుకున్నా… 2022లో సెట్స్‌కే పరిమితమయ్యాడు. 2023లో జంట చిత్రాలతో హిట్లు సొంతం చేసుకున్నాడు. మళ్లీ 2024లో షూటింగ్ దశలోనే ఆగిపోయాడు. అయితే వచ్చే సంవత్సరం బాలకృష్ణ సినిమాలు రెండు, మూడు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. బాబీ దర్శకత్వం వహించిన ‘డాకూ మహారాజ్’ రానున్న సంక్రాంతి రేసులో నిలిచింది. బోయపాటి కాంబోలో సిద్ధమవుతున్న ‘అఖండ-2’ కూడా 2025లోనే రిలీజ్ కానుంది. అన్నీ కలిసొస్తే మరో చిత్రం కూడా 2025లో సత్తా చాటుతుందని ఇండస్ట్రీ టాక్.
చిరంజీవి మాత్రమే కాదు మెగా కాంపౌండ్ హీరోలు ఎవరూ 2024లో ప్రేక్షకులను పలకరించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతినిండా సినిమాలు ఉన్నా.. కారణాంతరాల వల్ల ఈ ఏడాది ఒక్క చిత్రమూ తెరపైకి రాలేదు. ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడు సినిమాల్లో ఆయన నటిస్తున్నాడు. రియల్ లైఫ్‌లో పాలిటిక్స్‌తో పవన్ బిజీగా మారడంతో ఆయన సినిమాలు ఈ ఏడాది ఒక్కటీ విడుదల కాలేదు. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. 2022లో ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
గత రెండేండ్లుగా రామ్‌చరణ్ సినిమా సెట్స్‌లోనే చక్కర్లు కొడుతున్నది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ఛేంజర్’ ఈ ఏడాదే విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, కారణాంతరాల వల్ల 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది రామ్‌చరణ్ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ సినిమా కూడా ఈ ఏడాది ఏదీ రిలీజ్ కాలేదు. ఇటీవలే ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా షూటింగ్ మొదలైంది. అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది మెగా హీరోలందరూ అభిమానులకు విజువల్ ఫీస్ట్ పంచుతారని ఆశించొచ్చు.