Pawan Kalyan | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎవర్గ్రీన్ డిమాండ్ ఉంటుంది. వాళ్లు ఎప్పుడెప్పుడు కలిసి పని చేస్తారని ఆసక్తిగా వేచి చేస్తుంటారు అభిమానులు. అప్పుడప్పుడు వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ట్రాక్ తప్పుతుంటాయి. కానీ వాళ్ల క్రేజ్ మాత్రం తగ్గదు. అలాంటి అదిరిపోయే కాంబినేషన్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్. ఈ ఇద్దరి పేరు వినగానే అత్తారింటికి దారేది, జల్సా లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ ఆ రెండు సినిమాల తీపి జ్ఞాపకాలను మర్చిపోయేలా చేసింది అజ్ఞాతవాసి.
2018 సంక్రాంతికి ఆకాశమంత అంచనాలతో విడుదలైన ఈ సినిమా పాతాళమంత దారుణంగా పడిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో డిజాస్టర్ సినిమాల టాపిక్ వస్తే.. అజ్ఞాతవాసి గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించాడు గురూజీ. దాంతో కచ్చితంగా ఈ కాంబినేషన్లో ఇంకొక సినిమా రావాలి.. అది అజ్ఞాతవాసిని మరిపించేలా ఉండాలి అంటూ అభిమానులు చాలాకాలంగా కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన ఒప్పుకున్న సినిమాలు చేయడమే కష్టం అనుకుంటే.. కొత్త సినిమాలు కమిటవ్వడం అనేది దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపిస్తున్నాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
రవితేజ ఈగల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు ఈ నిర్మాత. మంచి కథ దొరికితే ఇద్దరితో సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని.. కచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా చేసే బాధ్యత తనది అంటున్నాడు విశ్వప్రసాద్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ముందు ఓజీ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మిగిలిన సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు పవర్ స్టార్.
ఈ లోపు త్రివిక్రమ్ మంచి కథ తీసుకొస్తే కచ్చితంగా ఈ కాంబినేషన్లో నాలుగో సినిమా ఎక్స్పెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువగా త్రివిక్రమ్ ను మాత్రమే నమ్ముతాడు. కేవలం ఆయన చెప్పినందుకు మరో మాట లేకుండా భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అజ్ఞాతవాసి ఫలితాన్ని మరిపించేలా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత.. పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు మానేసిన కూడా నో ప్రాబ్లం అంటున్నారు ఫ్యాన్స్. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.