తీసినవి ఒకట్రెండు సినిమాలే! సంగీతం కూర్చింది ఒకట్రెండు చిత్రాలకే!! రాసింది ఒకట్రెండు పాటలే!! పాడింది ఒకట్రెండు గీతాలే!! కానీ, వాటితోనే ఒక ట్రెండు సృష్టించారు కొందరు. ఆ ట్రెండ్ సెట్టర్స్ హిట్స్‌ను గుర్తు చేసుకోవడానికి ప్రత్యేకమైన సందర్భంతో పనిలేదు. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో పాతలోని వింతల్ని స్మరించుకుంటే.. ఉగాది పచ్చడిలో తీపి తగిలినంత ఆనందంగా ఉంటుంది.
Tollywood | కళాకారుడి నటన కలకాలం నిలిచిపోవడానికి వందల సినిమాలు చేయాల్సిన పనిలేదు. దర్శకుడి ప్రతిభకు గీటురాయిగా సినిమాల లిస్టు అక్కర్లేదు. ఒక్క మంచి చిత్రం చాలు!! సంగీత దర్శకులు, గాయకులు, రచయితలు ఇలా ఎందరో రెండుమూడు సినిమాలతో మూడు తరాలు గుర్తుంచుకునేంత కీర్తి మూటగట్టుకున్నారు. వారిలో కొందరు మన టాలీవుడ్లో పుట్టిపెరిగిన వారైతే, ఇంకొందరు బాలీవుడ్ ప్రతిభాశాలురు. ఇలాగ వచ్చి.. అలాగ మెచ్చుకునేలా తమ సృజనను పంచారు.
కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా.. నిదురపోరా తమ్ముడా..’ పాట తెలుగువారిని నిద్రపుచ్చింది. బాలీవుడ్ పాటల కోట మహారాణి లతామంగేష్కర్ గళంలో మొదటిసారి తెలుగు తేనెలద్దుకున్నది ఈ పాటతోనే. ‘నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా..’ అని ఆమె అన్నదే కానీ, లతమ్మ గాన మాధుర్యాన్ని నిదురలోనూ ఎలా మర్చిపోతాం? ఆ గాయనీమణి గానామృతంలో మరో రెండు తెలుగు పాటలు పరవళ్లు తొక్కాయి. ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’ పాట భక్తి పారవశ్యాన్ని పంచింది. తర్వాత కొన్ని దశాబ్దాలకు ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు తకధిమి తపనలు..’ అని తెలుగు సిరిమల్లె పూలకు సరికొత్త సరిగమలు నేర్పింది. ఆపై లత తెలుగు పాటలు పాడిందీ లేదు. మనం మురిసిందీ లేదు!!
బాలీవుడ్ గీతకారుల్లో మహమ్మద్ రఫీ తెలుగులో పదుల సంఖ్యలో పాటలు పాడారు. ‘భలే తమ్ముడు’, ‘ఆరాధన’, తల్లా పెళ్లామా?, తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, ‘అక్బర్ సలీం అనార్కలి’ సినిమాల కోసం తెలుగులో గొంతు సవరించుకున్నారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్టే! కానీ, బాలీవుడ్ సంగీత దర్శకులు ఇటుగా కన్నెత్తి చూసింది తక్కువే! ఎప్పటికో గానీ 1979లో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సి.రామచంద్ర ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రానికి సంగీతం అందించారు. 1988లో హిందీ చిత్రసీమ సంగీత దిగ్గజం ‘ఓపీ నయ్యర్’ తెలుగు సినిమాకు స్వరాలు కూర్చారు.
‘నీరాజనం’ సినిమా ప్రేక్షకుల ఆదరణకు అంతగా నోచుకోకున్నా.. అందులోని పాటలు నేటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. ‘నిను చూడక నేనుండలేను..’, ‘ఊహల ఊయలలో..’, ‘ఘల్లుఘల్లున గుండె జల్లన..’ పాటలతోపాటు ఈ చిత్రంలోని గీతాలన్నీ ఎవర్గ్రీన్ హిట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నవే! ఇదొక్కటే ఓపీ నయ్యర్ సంగీతం అందించిన తెలుగు సినిమా. అదే ఏడాది విడుదలైన ‘చిన్నికృష్ణుడు’ సినిమాతో ఆర్డీ బర్మన్ మొదటిసారిగా తెలుగు సినిమాకు స్వరాలు కూర్చారు.
ఆ సినిమా టైటిల్స్‌లో ‘ప్రప్రథమంగా తెలుగులో ఆర్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో’ అని పేర్కొన్నారు కూడా! ఈ సినిమాలో ‘జీవితం సప్తసాగర గీతం..’ పాట బర్మన్ సాబ్ ప్రత్యేకతను నేటికీ చాటుతూనే ఉంటుంది. తర్వాత నాలుగేండ్లకు నాగార్జున హీరోగా వచ్చిన ‘అంతం’ సినిమాలో కొన్నిపాటలకు ఆయన సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి శంకర్ శర్మకు బాలీవుడ్లో లెజెండరీగా పేరుంది. ఆయన సంగీతం అందించిన ఏకైక తెలుగు చిత్రం వినీత్ హీరోగా వచ్చిన ‘సరిగమలు’. ఈ సినిమాలోని పాటలన్నీ మెగాహిట్ సాధించినవే! ‘సరిగమలాపవయా.. సరసకు చేరవయా’, ‘స్వరరాగ గంగా ప్రవాహమే.. ’ పాటలు తరచూ రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి.
మాటల రచయితగా.. పాటల దగ్గరికి వచ్చేసరికి మనుసు కవిగా.. తెలుగు ప్రేక్షకులను అలరించిన కవి ఆచార్య ఆత్రేయ. వందలాది సినిమాలకు మాటలు, వెయ్యికిపైగా పాటలు రాసిన ఆయన ఒకే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా వచ్చిన ‘వాగ్దానం’ ఆత్రేయ డైరెక్ట్ చేసిన తొలి, మలి చిత్రం. కమర్షియల్‌గా ఫెయిల్ అయినా మ్యూజికల్‌గా మంచి హిట్ అయింది! తను తొలిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అన్ని పాటలూ రాసే అవకాశం ఉన్నా..
ఇతర రచయితలకూ అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే! ఇందులోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా.. నీ వెంట లోకాల గెలవనీరా’ పాట దాశరథి కృష్ణమాచార్యకు మొదటి సినిమా గీతం. ఆత్రేయ కన్నా ముందువాడు, తెలుగు సినీకవుల్లో పేరెన్నికగన్నవాడు సీనియర్ సముద్రాల. ఆయన మూడు సినిమాలకు మెగాఫోన్ పట్టుకున్నారు. ‘వినాయక చవితి’, ‘బభ్రువాహన’, ‘భక్త రఘునాథ్’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
దర్శకత్వంతో తమలోని కొత్త కోణాన్ని చూపించిన నటులు మహానటి సావిత్రి, విఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు. ‘మాతృదేవత’, ‘చిన్నారి పాపలు’ సినిమాలకు సావిత్రి దర్శకత్వం వహించారు. ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలను ఎస్వీయార్ డైరెక్ట్ చేశారు. తర్వాత చాలామంది నటులు చాలా సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, ఒకటీ అరా సినిమాలతో అద్భుతః అనిపించుకున్నవారు కొందరే! కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం బుల్లితెరపై ఎన్నో ధారావాహికలను డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘తోకలేనిపిట్ట’. అంతగా ఆడకపోయినా.. ఈ సినిమా నవ్వులు పూయిస్తుంది.
ఇలా ఒకట్రెండు సినిమాలతో అద్భుతాలు ఆవిష్కరించిన వారు కొందరున్నారు. ‘కోకిల’ చిత్ర దర్శకుడు గీతాకృష్ణ నాలుగైదు సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. మొదటి సినిమా ‘సంకీర్తన’తో ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్న ఆయన ‘కోకిల’తో వినూత్న డైరెక్టర్ అన్న పేరు సాధించాడు. మహేశ్‌బాబు నటించిన ‘బాబీ’తో పరిచయమైన దర్శకుడు శోభన్. ఆయన రెండో చిత్రం ‘వర్షం’ ప్రభాస్‌ను సూపర్ హీరోగా నిలబెట్టింది. తర్వాత రవితేజ హీరోగా ‘చంటి’ సినిమా తీశారంతే! తర్వాత ఒకట్రెండు సినిమాల్లో నటుడిగా అలరించి అకస్మాత్తుగా కన్నుమూశారు. సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్కు గొప్ప టెక్నీషియన్‌గా పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఒకరికి ఒకరు’, ‘భగీరథ’ రెండు చిత్రాలూ మంచి టాక్ తెచ్చుకున్నాయి.
తెలుగు సాహిత్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ లబ్ధప్రతిష్ఠుడు. వచన, పద్య కవిత్వాల్లో ఆయనకు ఆయనే సాటి అన్న పేరుంది. తెలుగు, ఆంగ్ల భాషల్లోనూ సమ ప్రజ్ఞ ఆయన సొంతం. అలాంటి కవిశ్రేష్ఠుడు తెలుగు సినిమా కోసం ఒకేఒక పాట రాశారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలముగ్గు’లో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది..’ గీతం వారు రాసిందే! రెండు చరణాల్లో సినిమా కథనంతా రంగరించిన వైనం అద్భుతం అనిపిస్తుంది. ‘నది దోచుకుపోతున్న నావను ఆపండి.. రేవు బావురుమంటుందని’ పంక్తులు ఫక్తు సినిమా ప్రయోగం కాకున్నా.. పండితులనే కాదు.. పామరులనూ అలరించాయి.