Swapna Varma | టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో తాను ఉంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఆరు నెలలుగా సినిమాలు లేకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
స్వప్న వర్మ స్వస్థలం రాజమండ్రి. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ అపార్ట్మెంట్ 101 ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటుంది. అయితే ఆరు నెలలుగా సినీ పరిశ్రమలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మానసికంగా ఒత్తిడికి గురైన ఆమె.. తన ఫ్లాట్‌లో రెండు రోజుల క్రితం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింకుంది. ఫ్లాట్ డోర్ వేసి ఉండటంతో ఈ విషయాన్ని ఎవరూ ఇది గమనించలేదు.
ఇవాళ ఉదయం ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని స్వప్న వర్మ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వర్మ్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.