Anil Ravipudi | గత పదేండ్లలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయని, నగరాభివృద్ధిని చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. హైదరాబాద్‌లో నివసిస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ముచ్చటిస్తూ.. నగర అభివృద్ధి విశేషాలను పంచుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేండ్ల్లు అవుతున్నది. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ చాలా ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటున్నారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం హైదరాబాద్ ప్రగతి అబ్బురపరుస్తున్నది. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన వారు ఇక్కడి అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడి అభివృద్ధిని బయటివాళ్లు మెచ్చుకుంటుంటే హైదరాబాద్‌లో నా కుటుంబంతో కలిసి ఉంటున్నందుకు గర్వంగా ఉంది. దేశ పటంలో తెలంగాణ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని దూసుకుపోతున్నది. అభివృద్ధిలో మన రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచింది.
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. పదేండ్లలో హైదరాబాద్‌లో ఏ చిన్న గొడవ జరిగిన దాఖలాలు లేవు. అంతలా ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు పరిఢవిల్లుతున్నాయి. ఇక రాత్రయితే హైదరాబాద్ అందం, వైబ్రేషన్స్ గురించి మాటల్లో చెప్పలేం. దేదీప్యమానంగా మన నగరం వెలిగిపోతున్నది. ‘భగవంత్ కేసరి’ సినిమా కోసం ఫ్లైకామ్ షాట్స్ తీసినప్పుడు హైదరాబాద్ బ్యూటీ చూసి ఫిదా అయ్యాను. నూతన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం కొలువుదీరడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కొత్త శోభతో వెలిగిపోతున్నాయి. మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చాలా కమిట్మెంట్తో ఉంటారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోతారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నదంటే దానికి కారణం కేటీఆర్ కమిట్మెంటే!