Terrorist Attack | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ దాడిలో సుమారు 27 మంది టూరిస్ట్‌లతో పాటు ఒక కాశ్మీరికి చెందిన స్థానిక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. అయితే ఈ విషాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు.
28 మంది అమాయకులను బలిగొన్న ఈ దారుణమైన దాడి హృదయవిదారకం. ఇది క్షమించరాని క్రూర చర్య. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి నష్టం అపారమైనదంటూ చిరంజీవి రాసుకోచ్చాడు.
పహల్గాం ఎంతో రమణీయమైన ప్రాంతం. అక్కడ జరిగిన ఈ దాడి వార్త నన్ను కలచివేసింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ అల్లు అర్జున్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. – ఎన్టీఆర్
ఈ దాడి భీకరమైనది. అమాయకులను చంపడం అత్యంత దారుణం. మృతుల కుటుంబాల కోసం నా ప్రార్థనలు. – అక్షయ్ కుమార్
పహల్గాం ఉగ్రదాడి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా హృదయం బాధతో నిండిపోయింది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అన్యాయం. ఇటువంటి అమానవీయ చర్యలపై కోపాన్ని అణచలేకపోతున్నాను. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తూ, మీ అందరితో కలిసి నిలబడతాను. ఈ బాధ నుంచి కోలుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – జాన్వీ కపూర్
ఇది క్షమించరాని నీచమైన చర్య. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడి, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. వారికి తగిన శిక్ష విధించాలి. – సంజయ్ దత్
అమాయక పర్యటకులపై జరిగిన ఈ పిరికి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాగరిక సమాజంలో ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు. ఈ దుష్ట చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. – సోనూ సూద్
రెండేళ్ల క్రితం నేను పహల్గాంలో ఒక సినిమా షూటింగ్లో, సందడి మరియు నవ్వుల మధ్య, మమ్మల్ని ఎంతో శ్రద్ధగా చూసుకున్న స్థానిక కాశ్మీరీ స్నేహితులతో కలిసి నా పుట్టినరోజు జరుపుకున్నాను. నిన్న జరిగిన ఘటన గుండెను కలచివేసేలా, కోపం తెప్పించేలా ఉంది. తమను ఒక శక్తిగా పిలుచుకుని, పర్యటకులపై కాల్పులు జరపడం అత్యంత సిగ్గుమాలిన, అవమానకరమైన, పిరికి ఉగ్రవాద చర్య. ఆయుధాల వెనుక దాక్కున్న ఈ మూర్ఖత్వం దుర్మార్గం. మేము బాధితులతో, వారి కుటుంబాలతో నిలబడతాము. మేము కాశ్మీర్‌తో నిలబడతాము. ఈ పిరికివారు త్వరగా నిర్మూలించబడాలని కోరుకుంటున్నాను. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదం ముందు తలవంచదంటూ విజయ్ దేవరకొండ రాసుకోచ్చాడు.
ఇది ఒక చీకటి రోజు… పహల్గాంలో జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇటువంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా నిలబడే శక్తిని పొందాలని ఆశిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్ బాబు