టాలీవుడ్ బాక్సాఫీస్ రాశీ ఖన్నాకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన గత నాలుగు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వీటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ మూడు స్ట్రైట్ చిత్రాలు కాగా..ఒకటి డబ్బింగ్ సినిమా ‘తిరు’ ఉంది. ఈ పరిస్థితి ఆమె కెరీర్లో కొత్త కాదు. నాయికగా అరంగేట్రం చేసినప్పటి నుంచి హిట్స్, ఫ్లాప్స్ చూస్తూ వస్తున్నది.
రెండు మూడు అపజయాల తర్వాత ఒక హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావడం రాశీకి అలవాటు. అయితే కెరీర్లో ఏది వచ్చినా హుందాగా స్వీకరిస్తానని చెబుతున్నదీ తార. ఆమె స్పందిస్తూ…‘నేను చేసిన ప్రతి సినిమాకు పూర్తి బాధ్యత వహిస్తా. అది విజయం సాధించినా ఘనత నాకే, అపజయం పాలైనా ఆ ఫలితాన్నీ అంగీకరిస్తా. నా దృష్టిలో ప్రతి సినిమా రూపకల్పన ఒక అందమైన ప్రయాణం. ఆ జర్నీని ఆస్వాదిస్తా. ఆ సినిమా పూర్తయ్యేలోపు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. సక్సెస్ అందరికీ కావాలి కానీ బాక్సాఫీస్ విజయం ఒక్కటే సంతోషపెట్టదు’ అని చెప్పింది.