సినిమా సృజనాత్మకతతో కూడుకున్న రంగం. అందుకే ఇక్కడ ఎప్పటికప్పుడు ధోరణులు మారుతూ ఉంటాయి. తద్వారా కొత్త కథలు పుట్టుకొస్తూ ఉంటాయి. కథలు కొత్తవి అయితే ఆటోమేటిగ్గా పాత్రలు కూడా కొత్తగానే గోచరిస్తాయి. ప్రస్తుత ట్రెండ్ రొటీన్ అయినప్పడు పాత ట్రెండ్‌పై మోజు మొదలవ్వడం కూడా సృజనాత్మకరంగంలో సహజమే. మన హీరోలంతా ప్రస్తుతం పౌరాణిక పాత్రలపై ఆసక్తి చూపించడానికి కారణం ఇదే. ఇది ఖర్చుతో కూడుకున్న శుభపరిణామం.
ఈ తరహా సినిమాలు రూపొందించడం ఓ యజ్ఞమైతే.. పౌరాణిక పాత్రలు పోషించడం ఓ తపస్సు. ఇది అందరికీ కుదిరే పనికాదు. భాగవత, రామాయణ, భారతాల్లోని పాత్రల్ని సినిమా పుట్టకముందే ప్రేమించడం మొదలుపెట్టారు జనం. అందుకే ఆ పాత్రల్లో సరిగ్గా అమరి, అభినయంతో ఆకట్టుకున్న నటీనటులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. ఎన్టీయార్ జనప్రియుడు కావడానికి, మహానటుడంటూ ఎస్వీఆర్ వీరతాళ్లు అందుకోవడానికి కారణం అదే. నిజానికి జనహృదయాల్లో పురాణపాత్రలు నాటుకుపోయినంతగా మరో పాత్రల్ని మనం చూడలేం. ఆ పాత్రలపై జనాలకు ఉన్న ప్రేమే అందుకు కారణం. ఎన్టీయార్, ఎస్వీయార్ లాంటి మహానటులకు జనాలు పలికే జేజేలలో 70 శాతం వాటా ఆ పాత్రలకే దక్కుతుంది.
నిజానికి తెలుగు సినిమా మొదలైందే ‘భక్తప్రహ్లాద’ అనే పౌరాణిక చిత్రంతో. ఆ తర్వాతా అడపాదడపా సాంఘికాలు, చారిత్రకాలు వచ్చినా.. ఎక్కువగా మాత్రం పౌరాణిక చిత్రాలే రూపొందేవి. పౌరాణిక పాత్రలు పోషించాలంటే ఆంగికం, వాచకం, ఆహార్యం, అభినయం అభినందనీయంగా ఉండాలి. అందుకే ఎక్కువగా రంగస్థలం నుంచే నటీనటులను తీసుకునేవారు. నాగయ్య, ఈలపాట రఘురామయ్య, సీఎస్సార్ ఆంజనేయులు, గోవిందరాజుల సుబ్బారావు, రేలంగి, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీయార్, ఎస్వీయార్.. వీరంతా రంగస్థలం నుంచి వచ్చినవారే. పైగా పౌరాణికాలంటే పద్యాలు గట్రా ఉంటాయి. కాబట్టి, పాడగలిగేవారికే తొలినాళ్లలో వేషం. ఘంటసాల రాకతో నటీనటులకు ఈ పాటల తిప్పలు తప్పాయి. ప్లేబ్యాక్ ఊపందుకుంది. ఎన్టీ రామారావు రాకతో పౌరాణికాలకు మహర్దశ మొదలైంది.
అక్కినేనితోపాటు ఓ వైపు సాంఘికాలు చేస్తూనే మధ్యమధ్యలో అద్భుతమైన పౌరాణిక చిత్రాల్లో నటించారు రామారావు. కృష్ణుడు, రాముడు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, భీష్ముడు, అర్జునుడు, బృహన్నల, కర్ణుడు, కీచకుడు, సుయోధనుడు, రావణుడు, ఇంద్రజిత్.. ఇలా దాదాపు నాయక లక్షణాలున్న పాత్రలన్నిటినీ పోషించారాయన. హనుమంతుడు, నారదుడు మినహా. ఇక అక్కినేని హీరోగా నటించిన తొలి సినిమానే ‘సీతారామ జననం’. అందులో ఆయన రాముడు. ఆ తర్వాత ‘చెంచులక్ష్మి’లో శ్రీమహావిష్ణువుగా, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో అర్జునుడిగా, భూకైలాస్, నారద-నారది సినిమాల్లో నారదుడిగా మెప్పించారు. కాంతారావు కూడా రాముడు, కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, లక్ష్మణుడు తదితర పురాణ పాత్రలు ధరించి శభాష్ అనిపించుకున్నారు. వారిదారిలోనే తర్వాత తరం హీరోలైన హరినాథ్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి వారు కూడా పలు పౌరాణిక పాత్రలు పోషించారు.
అయితే వయసు పెరగటంతో ఎన్టీఆర్ పౌరాణికాలను తగ్గించి, సోషల్ కమర్షియల్ సినిమాల బాటపట్టారు. దాంతో 70వ దశకం చివరి నుంచి సినీ పౌరాణికం మసకబారింది. అడపాదడపా కేఆర్ విజయ అమ్మవారి సినిమాలు, ‘దత్తదర్శనం’ లాంటి చిన్న సినిమాలు మాత్రమే వచ్చేవి. క్రమేపీ అవి కూడా కనుమరుగయ్యాయి. నటుడు బాలకృష్ణ మాత్రం తాను నటిస్తున్న కమర్షియల్ సినిమాల్లోనే అక్కడక్కడ పౌరాణిక పాత్రల్లో తళుక్కున మెరిసేవారు. ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలో రాముడిగా, కృష్ణుడిగా, ‘సీతారామకల్యాణం’ సినిమాలో రాముడిగా, శివుడిగా, ‘దేశోద్ధారకుడు’ చిత్రంలో దుర్యోధనుడిగా, ‘రాముడు-భీముడు’ సినిమాలో భీముడిగా ఇలా కనిపిస్తూ తన తండ్రి ఎన్టీఆర్‌ని గుర్తు చేసేవారు.
1996లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జున విజయం’ అనే పూర్తి స్థాయి పౌరాణిక చిత్రంలో నటించారు. చాలా విరామం తర్వాత వచ్చిన ఆ పౌరాణిక చిత్రం దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణుడిగా నటిస్తూ ‘పాండురంగడు’ (2008) అనే మరో చిత్రం చేశారు బాలకృష్ణ. అది కూడా ఫ్లాప్ అయింది. 2011లో బాపు దర్శకత్వంలో చేసిన ‘శ్రీరామరాజ్యం’ సినిమా మాత్రం ఫర్వాలేదనిపించింది.
బాలకృష్ణతోపాటు నటుడు సుమన్ కూడా ‘అన్నమయ్య’లో శ్రీనివాసుడిగా, ‘శ్రీరామదాసు’లో శ్రీరాముడిగా, ‘సత్యనారాయణస్వామి’ చిత్రంలో త్రిమూర్తులుగా, సత్యదేవుడిగా అలరించి, ఓ తరంలో ఎక్కువ పౌరాణికాల్లో నటించిన హీరోగా నిలిచారు. ఈ మధ్యలో‘శ్రీమంజునాథ’ అంటూ చిరంజీవి పరమ శివుడిగా మెప్పిస్తే.. గుణశేఖర్ ‘రామాయణం’లో పసివాడైన జూనియర్ ఎన్టీయార్ రాముడిగా అలరించాడు. అలాగే ఎదిగాక, రాజమౌళి ‘యమదొంగ’లో కాసేపు యంగ్ యముడిగా యమహా అనిపించాడు ఎన్టీయార్.
ప్రస్తుతం సినీరంగంలో పానిండియా ట్రెండ్ నడుస్తున్నది. ‘బాహుబలి’ పుణ్యమా అని.. బడ్జెట్లు కూడా వందల కోట్ల్లకు చేరాయి. యూనివర్సల్‌గా జనం మెచ్చే కథలు కావడంతో మేకర్స్ దృష్టి పౌరాణికాల వైపు మళ్లింది. దాంతో అగ్ర హీరోలు సైతం పురాణపాత్రలపై మోజు కనపరుస్తున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా మూడేళ్ల క్రితం వచ్చిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. ఇందులో సీతగా కృతి సనన్ నటించగా, రావణుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూడటంతోపాటు దేశవ్యాప్తంగా విమర్శలను కూడా మూటగట్టుకుంది. పౌరాణిక చిత్రాన్ని నిర్మించడం ఎంత కష్టమో ప్రారంభంలోనే నేటి మేకర్స్‌కి తెలిసొచ్చేలా చేసింది ‘ఆది పురుష్’. ఆ తర్వాత పౌరాణిక పాత్రల మేళవింపుగా ప్రభాస్ చేసిన మరో పానిండియా ఫిక్షన్ ‘కల్కి 2898ఏడీ’. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ అశ్వత్థామగా విశ్వరూపం చూపించారు. ైక్లెమాక్స్‌లో దేవరకొండ విజయ్ అర్జునుడిగా కనిపించి ఆడియన్స్‌కి స్వీట్ షాక్ ఇస్తే, ప్రభాస్ కర్ణుడిగా కనిపించి సంభ్రమకు గురిచేశారు. దాంతో ‘కల్కి 2’పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ నిర్మాణ దశలో ఉన్నది. రీసెంట్గా మంచు విష్ణు నిర్మించి, నటించిన ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్‌కుమార్ శివుడిగా, ప్రభాస్ శివగణంలా కనిపించి అలరించిన విషయం విదితమే.
ఇక ప్రస్తుతం పౌరాణిక పాత్రలు చేస్తున్న హీరోల వివరాల్లోకెళ్తే.. ముందు చెప్పుకోవాల్సింది మహేశ్‌బాబు గురించి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రేతాయుగానికి చెందిన ఓ 20 నిమిషాల ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్లో మహేశ్ శ్రీరామచంద్రుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే వెల్లడించారు. మహేశ్‌ని శ్రీరాముడిగా చూసేందుకు అభిమానులే కాదు, సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నారు ‘కాంతారా’ ఫేం రిషబ్ శెట్టి. ఇందులో ఆయన హనుమంతుడిగా నటిస్తుండటం విశేషం. ఒక స్టార్ హీరో హనుమంతుడిగా పూర్తిస్థాయిలో నటించడం ఇదే ప్రథమం.

దగ్గుబాటి అశ్వత్థామగా కనిపించనున్నారు. ఆయన పాత్రను దర్శకుడు ప్రశాంత్‌వర్మ అద్భుతంగా డిజైన్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. ప్రశాంత్‌వర్మ యూనివర్స్ నుంచే వస్తున్న మరో మైథలాజికల్ కాన్సెప్ట్ ‘మహాకాళి’. ఇందులో మహాకాళిగా భూమిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నది.

ఈ పురాణ పాత్రల మోజు తెలుగుకి మాత్రమే కాదు, బాలీవుడ్‌కీ బలంగానే తాకింది. ప్రస్తుతం రెండువేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పానిండియా పౌరాణిక చిత్రారాజంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌కపూర్ నటిస్తుండగా, సీత పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణుడిగా ‘కేజీఎఫ్’ ఫేం యష్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పనఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నారు. ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, మలిభాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నది.

ఇక మహాభారతాన్ని తెరకెక్కించడం జీవితాశయమని రాజమౌళి అంటుంటే, మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ కూడా ఇదే పాట పాడుతున్నారు. ఒకవేళ వీరి లక్ష్యాలు కార్యరూపాలు దాలిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్లంతా ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పురాణ పాత్రల్లో కనిపించడం ఖాయం.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. పురాణపాత్రల్లో కనిపించడం గొప్ప కాదు. మెప్పించడం గొప్ప. జనాన్ని ఒప్పించడం గొప్ప. మొదట్నుంచీ పౌరాణికాలపై పేటెంట్ హక్కులు తెలుగువారివే. తెలుగుతెరపై నాటి నటదిగ్గజాలు వేసిన ముద్ర అంత బలమైంది. వారిలాగే, నేటి తారలు కూడా అలరించాలని, అద్భుతాలు సృష్టించాలని, తెలుగుతెరపై పౌరాణికాలు దేదీప్యమానం కావాలని ఆశిద్దాం.
ఇక స్కాంద పురాణంలోని కీలక ఘట్టం ఆధారంగా ఇప్పటికే అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథ తయారు చేశారు. కుమారస్వామిగా తారక్ నటించే ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే కుమారస్వామి కథతోనే మరో దర్శకుడు కిశోర్ తిరుమల కూడా ఓ కథ రాసుకున్నారని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వార్త కూడా రానున్నదని సమాచారం. మరోవైపు సమంతతో ‘శాకుంతలం’ సినిమా తీసి చేతులు కాల్చుకున్న దర్శకుడు గుణశేఖర్.. రానా కథానాయకుడిగా ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని
నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
– బుర్రా నరసింహ