Sreeleela | ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే ఒక శుక్రవారం దశ తిరిగితే చాలు. అలాగే ఉన్న సుడి పోవాలంటే కూడా ఒక శుక్రవారం చాలు. శ్రీలీల విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. ఆమె కెరీర్‌కు అతి ముఖ్యమైన సినిమాగా వచ్చిన ఆదికేశవ బాక్సాఫీస్ దగ్గర తడబడేలా కనిపిస్తోంది. రెండేళ్ల కింద పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన శ్రీలీల.. ధమాకాతో స్టార్ అయిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.
ఈ అవకాశాల మత్తులో పడి కథలు ఎంపికలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అసలు ప్రమాదం ఇప్పుడు ఎదురైంది. వరుస సినిమాలు ఒప్పుకున్నంత ఈజీగా వరుస విజయాలు రావాలని లేదు. ఇప్పుడు ఇదే జరుగుతుంది శ్రీలీల విషయంలో. అప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ ఇప్పుడు నెలకు ఒకటి విడుదలవుతున్నాయి. కాకపోతే ఫలితాలు మాత్రం ఊహించిన విధంగా వస్తున్నాయి. కథ కాకుండా కాంబినేషన్ పై ఫోకస్ పెడుతూ.. తప్పు చేస్తుందని విషయం ఆమె సినిమాల ఫలితాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో ముందుగా స్కంద పేరు చెప్పుకోవాలి. రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద ఎన్నో రకాలుగా ట్రోల్ అయింది కూడా. హ్యాట్రిక్ అందుకుందాం అనుకున్న శ్రీలీల ఆశలకు ఈ సినిమా గండి కొట్టింది.
దసరాకు విడుదలైన భగవంత్ కేసరితో ఫామ్ లోకి వచ్చినా.. ఇందులో శ్రీలీల హీరోయిన్ కాదు.. బాలయ్య కూతురు పాత్రలో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడం అనేది అందరూ హీరోయిన్లకు చేత కాదు.. వాళ్లు ఆ డేర్ కూడా చేయలేరు కానీ శ్రీలీల చేసింది. గతంలో హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుసగా 5 ఫ్లాపులతో ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇప్పుడు శ్రీలీల మరో కృతి శెట్టి కాకూడదు అంటే ఆదికేశవ ఒక్కటే ఆయుధం అనుకున్నారంతా. కానీ ఔట్ డేటెడ్ కథతో వచ్చిన ఆదికేశవ మూడు రోజులు కూడా ఆడేలా కనిపించడం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆదికేశవ అంచనాలు తప్పడంతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలపైనే శ్రీలీల ఆశలున్నాయ్ ఇప్పుడు.