Raashii Khanna | మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని సినీ నటి రాశి ఖన్నా అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబిని జ్యువెల్ మాల్లో మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో ‘ వీనస్ ది గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాశిఖన్నా.. పలు ఆభరణాలను ధరించి సందడి చేశారు.
అనంతరం రాశి ఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. మన సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఇక్కడ రూపొందించిన ఆభరణాలు తనకు ఎంతగానో నచ్చాయని తెలిపారు. ప్రతి అమ్మాయి ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతుందని, అలాగే తనకు కూడా ఆభరణాలు ధరించడం ఇష్టమేనని అన్నారు. అయితే సందర్భానుసారంగా తన అలంకరణ ఉంటుందని చెప్పారు. డిజైనర్ నయన్ గుప్తా రూపొందించిన ఈ ఆభరణాలు ప్రత్యేక రీతిని కలిగి ఉన్నాయని అన్నారు. మగువల, యువత మనసును ఇవి కచ్చితంగా దోచుకుంటాయని అభిప్రాయపడ్డారు.
డిజైనర్ నయన్ గుప్తా మాట్లాడుతూ.. మగువల ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పలువురు మోడల్స్ నగలను ధరించి హొయలు పోయారు.