Anupama Parameswaran | ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్‌కు మొదటిసారి వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అంటున్నారు నటి అనుపమా పరమేశ్వరన్. తాజాగా ఆమె హైదరాబాద్ గురించి తన అనుభవాలను పంచుకున్నారు.
హైదరాబాద్‌తో మీ అనుబంధం ఎలా మొదలైంది?
కేరళలోని ఇరింజల్కూడ మా ఊరు. అక్కడే చదువుకున్నాను. తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో 2015లో హైదరాబాద్ వచ్చాను. ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ టౌన్ అయిపోయింది. హైదరాబాద్ చాలా స్పెషల్.
హైదరాబాద్‌లో మీకు నచ్చిన అంశాలేంటి?
చాలామంది హైదరాబాద్‌ను మినీ ఇండియా అంటుంటారు. నన్నడిగితే నేను పుష్పకవిమానం అంటాను. ఎందుకంటే పుష్పకవిమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటుంటుంది. హైదరాబాద్ కూడా అంతే. ఎంతమందికైనా షెల్టర్ ఇస్తుంది. ఇక్కడి వాతావరణం సూపర్. ముఖ్యంగా మా సినిమావాళ్లకు. హాయిగా షూటింగులు చేసుకోవచ్చు. గతంలో ట్రాఫిక్ సమస్య ఉండేది. గవర్నమెంట్ చాలా ఫ్లైఓవర్లు కట్టేసింది. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తగ్గింది.
ఈ ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌లో మీరు చూసిన మార్పు?
చాలా ఉంది. ఏడాదికేడాది మారుతూనే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తుంటే హైదరాబాద్‌లో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా అనిపిస్తున్నది. నగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. నిజంగా ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ ఇదే.