Tollywood | 2025 సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమకు ఇది అంతగా కలిసి రాని ఏడాదిగానే చెప్పుకోవాలి. భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలనుకున్న పలు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 వంటి మోస్ట్ అవైటెడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక, ఈ ఏడాది అతిపెద్ద పరాజయాలుగా నిలిచాయి. కొన్ని సినిమాలు ఓవరాల్ కలెక్షన్లలో పెద్ద నంబర్లే చూపించినప్పటికీ, ఏరియా వారీ లెక్కల్లో చూస్తే నష్టాలే ఎక్కువగా కనిపించాయి.
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రస్తుతం ఎంత గడ్డు దశలో ఉందన్నది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని ప్రాంతాల్లో లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టేంత తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే రెండు చిన్న సినిమాలు ఊహించని రీతిలో అద్భుత విజయాలు సాధించి, 2025 టాలీవుడ్‌కు కొత్త ఆశను చూపించాయి.న్యాయవ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ చిత్రం ఈ ఏడాది సంచలన విజయంలో ఒకటిగా నిలిచింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపాల ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రియదర్శి పులికొండ, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రల్లో కనిపించారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా, పోక్సో చట్టం దుర్వినియోగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందింది.
సినిమా విడుదలకు ముందే నాని చేసిన కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో “ఈ సినిమా నచ్చకపోతే నా HIT 3 కూడా చూడకండి” అంటూ నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ప్రేమలో పాట చార్ట్‌బస్టర్ కావడం, పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడం సినిమాకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా శివాజీ పోషించిన ‘మంగపతి’ పాత్ర ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది. డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ సున్నితమైన అంశాన్ని నైపుణ్యంగా తెరకెక్కించారని ప్రశంసలు దక్కాయి. థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
లిటిల్ హార్ట్స్
అంచనాలకు మించిన విజయం సాధించిన మరో చిత్రం లిటిల్ హార్ట్స్. మొదట నేరుగా డిజిటల్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. యూట్యూబ్ ఫేమ్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా నటించగా, శివాని నగరం హీరోయిన్గా కనిపించింది. దర్శకుడు సాయి మార్తాండ్‌కు, అలాగే హీరో హీరోయిన్లకు ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఏకంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫ్రెష్ కథ, కొత్త నటీనటులు, స్వచ్ఛమైన కామెడీ, సింజిత్ ఎర్రమిల్లి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలయ్యాయి. వినూత్న ప్రమోషన్లు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ETV Win లో మంచి స్పందన వచ్చిన తర్వాత, ఇతర భాషల ప్రేక్షకుల డిమాండ్‌తో ఇప్పుడు Netflix లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కంటెంట్‌కే ప్రేక్షకుల పట్టం
ఈ రెండు సినిమాలతో పాటు రాజు వెడ్స్ రాంబాయి కూడా మరో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచి, పెద్ద స్టార్స్ లేకపోయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అయినా, బలమైన కథలు, నిజాయితీ గల మేకింగ్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించగలవని 2025 టాలీవుడ్ ఈ ఉదాహరణలతో స్పష్టం చేసింది. ముందు రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలు ఇలాంటి విజయాలు సాధించి, కొత్త టాలెంట్‌కు మరింత గుర్తింపు తెస్తాయనే ఆశను ఈ చిత్రాలు కలిగిస్తున్నాయి.