‘ప్రేమించిన వాడికోసం ఎంటి త్యాగానికైనా వెనుకాడని అమ్మాయిగా ఇందులో కనిపిస్తా. ఇందులో నా పాత్ర పేరు సార. మార్వాడీ అమ్మాయిని. తొలి సినిమాకే ఇంతటి మంచి పాత్ర దొరకడం నా అదృష్టం’ అని అందాలభామ నూపుర్ సనన్ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నూపుర్ మీడియాతో ముచ్చటింది.
‘ కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా సినిమాలు ఈ సంస్థనుంచే వచ్చాయి. అలాంటి సంస్థనుంచి వస్తున్న సినిమా నాకు లాంచింగ్ ప్రాజెక్ట్ కావడం అదృష్టంగాక మరేంటి? దర్శకుడు వంశీ నా పాత్రకోసం దాదాపు 200మందిని ఆడిషన్స్ చేసి, చివరకు నన్ను ఎంపిక చేశారు. దాంతో నాపై నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.’ అంటూ చెప్పుకొచ్చారు నూపుర్. దర్శకుడు ఎంతో రీసెర్చ్ చేసి, తీసిన సినిమా ఇదని, వంశీ క్లారిటీ ఉన్న దర్శకుడని నూపుర్ అన్నారు.
రవితేజ గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఓకే అవ్వగానే రవితేజగారి సినిమాలన్నీ చూశాను. ఆయన నిజంగా మాస్ మహారాజా.. నోడౌట్. రవితేజగారి టైమింగ్ అద్భుతం. లొకేషన్లో చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పారు. తన సోదరి కృతి సనన్ గురించి చెబుతూ ‘అక్క కెరీర్ కూడా తెలుగు నుంచే మొదలైంది. నేను హీరోయిన్ అవ్వలనుకుంటున్నానని అక్కకు తెలియగానే ఒకేమాట చెప్పింది. ‘ఎక్కడైనా సారే.. నువ్వు నీలా ఉండు’ అని. అదే అనుసరిస్తా’ అన్నారు నూపుర్..