అగ్ర నటుడు కమల్‌హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ‘థగ్‌లైఫ్’ ఈవెంట్లో తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందని కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. ఈ నెల 30లోగా కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అల్టిమేటం జారీచేసింది.
తాము విధించిన డెడ్‌లైన్ ముగిసినా కమల్‌హాసన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వివాదంపై క్షమాపణ చెప్పడానికి కమల్‌హాసన్ నిరాకరించారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘గతంలో కూడా నా మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. తప్పుచేయని పక్షంలో నేను అస్సలు క్షమాపణలు చెప్పను. ఇది నా జీవన విధానం. నేను ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతాను’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకానుంది.