‘సమోసా తింటావా.. శిరీషా!’ అంటూ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు సినీనటుడు తిరువీర్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే.. ఇండస్ట్రీకి వచ్చి, విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిగ్రీలో ఉన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ఫిక్సయి.. థియేటర్ ఆర్టిస్ట్ అవతారమెత్తాడు.అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా టీటౌన్‌లోకి అడుగుపెట్టాడు. ‘బొమ్మల రామారం’తో మల్లేశ్‌గా తెరపై సందడిచేశాడు. ఆ తర్వాత లలన్ సింగ్‌గా జార్జిరెడ్డితో తలపడి.. ‘మసూద’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ప్రేక్షకులను రిపీటెడ్‌గా థియేటర్లకు రప్పిస్తున్నాడు. తెలుగు సినీపరిశ్రమలో ‘కోట శ్రీనివాసరావు’లా అన్నిరకాల క్యారెక్టర్లు చేయాలన్నదే తన కోరికని చెబుతున్నాడు. ఈ సందర్భంగా థియేటర్ ఆర్టిస్ట్ నుంచి ఆన్‌స్క్రీన్ వరకు సాగిన తిరువీర్ ప్రయాణం ఆయన మాటల్లోనే..
అమ్మానాన్నల రెక్కల కష్టమే నన్ను మంచి నటుణ్ని చేసింది. మాది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ దగ్గర మామిడిపల్లి గ్రామం. అమ్మ పేరు వీరమ్మ. నాన్న వెంకటరెడ్డి. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముణ్ని నేను. నా చిన్నప్పుడే ఊళ్లో పొలాలన్నీ అమ్ముకొని వలసకూలీలుగా మారి.. కాటేదాన్‌లో స్థిరపడ్డాం. హైదరాబాద్ కల్చర్‌కు అలవాటు పడిన నేను.. సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్, యాక్టింగ్‌ను నా లక్ష్యంగా మార్చుకున్నా. దానికితోడు సిటీ కాలేజీలో ఎప్పుడుచూసినా ఏదో ఒక షూటింగ్ జరుగుతుండేది. ఆ ప్రభావం నామీద బలంగా పడింది. యాక్టింగ్ నేర్చుకోవాలనే కోరిక చాలా ఉండేది. కానీ, డబ్బులు పెట్టి నేర్చుకునేంత స్తోమత లేక వెనుకడుగు వేశాను.
థియేటర్ ఆర్టిస్ట్‌గా
నా ఇష్టాలు తెలిసిన మిత్రులు కొంతమంది యాక్టింగ్ నేర్చుకోవాలంటే తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్సులో చేరమని సలహా ఇచ్చారు. అలా రెండేండ్ల థియేటర్ ఆర్టిస్ట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నా. కోర్సు పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాలను వెతుక్కుంటూనే కొన్నిరోజులు ఫ్రీలాన్సర్‌గా, ఎఫ్ఎం ఆర్జేగా పనిచేశా. నాటకరంగం మీద ఇష్టంతో టాక్స్ ఫ్రీ, కిషోర్ శాంతభాయ్ కాలే, న్యూ భారత్ కేఫ్, బర్భరీకుడు, కొణతం దిలీప్ తెలుగులోకి అనువాదం చేసిన ఒక దళారి పశ్చాత్తాపం వంటి 50కి పైగా నాటకాల్లో వివిధ రకాల పాత్రలు వేసి జనాలను మెప్పించా. 2016 వరకు నాటకరంగానికి ఫుల్‌టైం పనిచేసినా, ఈ తర్వాత నుంచి 2022 వరకు సమయం ఉన్నప్పుడు మాత్రమే పాల్గొనేవాణ్ని.

అందుకే ఆఫ్‌స్క్రీన్‌పై..
ఒకవైపు థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచిపేరు వచ్చినా, మనసంతా సినిమాలపైనే ఉండేది. ఎప్పుడెప్పుడు స్క్రీన్‌మీద నన్ను నేను చూసుకుంటానా!? అని ఆశగా ఎదురుచూసేవాణ్ని. మా కాలేజీ సీనియర్ ఖాజాపాషా ‘డాటర్ ఆఫ్ వర్మ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసి, అందులో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయమని నా ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. ఈ పని ఆఫ్‌ది స్క్రీన్ అని తెలిసినా అవకాశాలకోసం తప్పలేదు. ఖాజాపాషాతో కలిసి పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని ఆ సినిమాకు ఓకే చెప్పా. సిద్ధార్థ్, రవితేజ లాంటి హీరోలు కూడా ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్నుంచే వచ్చారని గుర్తుచేసుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చినా కూడా అంత త్వరగా అవకాశాలు రాలేదు. పట్టువిడవకుండా ప్రయత్నిస్తున్న సమయంలోనే.. ‘ఏం మంత్రం వేశావే’లో తొలి అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో 2016లో ‘బొమ్మల రామారం’ సినిమాతో మల్లేష్‌గా తొలిసారి స్క్రీన్‌పై కనిపించా. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా జార్జిరెడ్డి సినిమాతోనే నేనంటే చాలామందికి తెలిసింది.
రెండోవారం కూడా సక్సెస్‌ఫుల్‌గా
ఒకరోజు ఉస్తాద్ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి ‘నాకు తెలిసినవాళ్ల దగ్గర ఒక కథ ఉంది వింటావా!?’ అని అడిగితే రమ్మన్నాను. విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఆ కథలోని సంఘటనలన్నీ మనం నిత్యం ఎదుర్కొనేవే! జనాలకు కచ్చితంగా నచ్చుతుందని వెంటనే ఒకే చెప్పాను. సక్సెస్ కంటే ముందు నా హ్యాపీనెస్‌ను కోరుకుంటా. అందుకే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో నటించేందుకు ఒప్పుకొన్నా. అంతే కాకుండా, ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గానూ ఉన్నా. రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభం వస్తే ఇవ్వండని చెప్పా. కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేశాం. గతంలో ‘1978 పలాస’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీకాకుళం యాసను నేర్చుకున్నాను కాబట్టి ఈ సినిమాకు ఆ యాసలో ఇమిడిపోయాను. సినిమా విడుదల కాగానే ప్రేక్షకులు బాగా ఆదరించారు. టాలీవుడ్‌లోని ప్రముఖులు ఫోన్లు చేస్తూ, ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విడుదలైన రెండోవారం కూడా సినిమా థియేటర్లలో ఉందంటే.. జనాలు అంతలా ఆదరిస్తున్నారన్నమాట. ఇక్కడ రానా గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన షూటింగ్ బిజీలో ఉండి కూడా ఫోన్‌చేసి మరీ అభినందించారు. ఇప్పుడే కాదు, నాకు ఆయన చాలా విషయాల్లో సపోర్టుగా నిలిచారు.
సాహిత్యంతో సోపతి
నా సక్సెస్‌లో నా భార్య కూడా భాగమే. తన పేరు కల్పనా రావు. వాళ్లది కరీంనగర్. ఆటోమొబైల్ ఇండస్త్రీలో పనిచేస్తుంది. 2023లో స్నేహితుల ద్వారా మా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2024లో పెండ్లితో ఒక్కటయ్యాం. తన కంపెనీలో అంతమందిని డీల్చేయడం వల్ల నా ఒక్కణ్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆమెకు చిన్న విషయం. షూటింగ్ బిజీలో తిండిని అశ్రద్ధ చేస్తే, తినేవరకూ పట్టుబడుతుంది. అర్థం చేసుకునే అర్ధాంగి తను. సమయం దొరికితే ట్రావెలింగ్కు వెళ్తాం! ఇంట్లో ఖాళీగా ఉండటం నాకు నచ్చదు. సాహిత్యపు మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్లు నిర్వహించే కవిసంగమం లాంటి కార్యక్రమాలకు వెళ్లేవాణ్ని. ఒకప్పుడు పుస్తకాలు చదవడం అలవాటు. ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నా.
జోలపాటలా..
సినిమాల మీద ఇష్టంతో నా మొదటి సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ అయినా పనిచేశా. సినిమాను నమ్ముకున్నాను కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ఇప్పటివరకు నేను చేసిన 11 సినిమాల్లో ఆడిషన్ లేకుండా రెండు సినిమాల్లో మాత్రమే నటించా. అందులో ఒకటి మసుధ, రెండోది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. భవిష్యత్తులో కోటా శ్రీనివాసరావు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్ లాగా అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా కోరిక. టాలీవుడ్ అనే కాకుండా అవకాశాలు వస్తే ఎక్కడైనా పనిచేస్తా. అమ్మజోలపాటలా హాయిగా ఊ కొట్టించే కథలు ఉంటే.. నటించే అవకాశం అస్సలు మిస్ చేసుకోను. టాలీవుడ్లో టాలెంట్ ఉన్నోళ్లకు ఎప్పుడూ పనుంటది.
వాళ్లపేరుతో కలిసిపోయి
నా అసలు పేరు తిరుపతి రెడ్డి. అమ్మ వీరమ్మ మీద ప్రేమతో.. నాకు యాక్టింగ్‌లో మార్గదర్శిగా నిలిచిన నా సీనియర్ రఘువీర్ మీద అభిమానంతో.. వాళ్లిద్దరి పేర్లను నా పేరుతో కలుపుతూ ‘తిరువీర్’ అని పెట్టుకున్నా. కానీ ఇప్పటికి చాలామంది నేను కనిపిస్తే ‘పరేషాన్’ సినిమాలోని ‘సమోసా తింటావా శిరీషా’ డైలాగ్‌ను గుర్తు చేస్తుంటారు. లలన్ సింగ్, మసుధ హీరో అనికూడా పిలుస్తుంటారు.
-రాజు పిల్లనగోయిన