Tollywood | కథే.. హీరో! ఒకప్పటి సినిమా సూత్రం! హీరోనే.. కథ! ఇప్పటి కమర్షియల్ ఫార్ములా. దేన్ని ఎంచుకున్నా.. హీరోయిజాన్ని పండించడానికి అందమైన హీరోయిన్, బలమైన విలన్ కంపల్సరీ! దీంతోపాటు చైల్డ్ సెంటిమెంట్‌ను సినిమా సక్సెస్ మంత్రంగా ఎంచుకున్న సందర్భాలు కోకొల్లలు. చిన్నారుల చుట్టూ తిరిగే కథతో రూపొందిన సినిమాలు అడపాదడపా వెండితెరపై కాసుల వర్షం కురిపించాయి. అయితే, ఇటీవల పసివాడి పాత్రలు మళ్లీ బలంగా ప్రాణం పోసుకుంటున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిన్నారి చుట్టూ కథను నడిపిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.
సాదాసీదా కథలతో సినిమాలు తీస్తే సక్సెస్‌పై నమ్మకం లేకుండా పోతున్న రోజులు వచ్చేశాయి. అందుకే కొత్త దర్శకులు కొంగొత్త కథలను ఎంచుకుంటున్నారు. హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ హంగులన్నీ జతచేసినా, విభిన్నమైన మూలకథను ఎంచుకొని, దానిని చిన్నపిల్లలతో ముడిపెడుతున్నారు. పరోక్షంగా ఉంటూనే ప్రధాన కథను నడిపించే బాధ్యతను ఆ పిల్లల భుజాన వేస్తున్నారు. ఇవి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంతో ఈ తరహా కథలకు మరింత పదును పెడుతున్నారు. గతంలోనూ పిల్లల సెంటిమెంట్ సినిమాలు కోకొల్లలు వచ్చాయి. 1954లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాజు-పేద’ మొదలుకొని యేటా ఈ తరహా చిత్రాలు ఒకట్రెండు ప్రేక్షకులను పలకరించాయి! చిరంజీవి హీరోగా వచ్చిన ‘పసివాడి ప్రాణం’ పిల్లల సెంటిమెంట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయశాంతి కథానాయికగా వచ్చిన ‘రేపటి పౌరులు’ సినిమాను అప్పట్లో స్కూలు పిల్లలకు ప్రత్యేక షో వేసి చూపించారు కూడా! అయితే, ప్రధాన కథకు అనుబంధంగా మరో స్క్రీన్‌ప్లే రన్ చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు నేటి దర్శకులు.
నాని హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ‘హాయ్ నాన్న’. ఇందులోనూ చైల్డ్ సెంటిమెంట్ హృదయాన్ని హత్తుకుంది. అమ్మానాన్నల ప్రేమకథను కూతురి ద్వారా నడిపించి సరికొత్త ప్రయోగం చేశాడు దర్శకుడు శౌర్యువ్. తండ్రి, కూతుళ్ల అనుబంధం విజువల్ ఫీస్ట్‌గా ఉండటంతో ‘హాయ్ నాన్న’కు మంచి మైలేజ్ వచ్చింది. తాజాగా వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘సైంధవ్’ సినిమా టీజర్లోనూ తండ్రీకూతుళ్ల అనుబంధం కనిపిస్తుంది. గన్స్ మాఫియాను వైరిపక్షంగా చూపించినా, టీజర్ ఎండింగ్లో తండ్రీకూతుళ్లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి.. ఈ సినిమాలో రెండో కోణం ఉందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు శైలేష్. ‘హిట్’ ఫ్రాంచైజీ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ ఈ చిత్రాన్ని యాక్షన్ కమ్ సెంటిమెంట్‌గా తెరకెక్కించాడని టీజర్ చూస్తే తెలుస్తున్నది.
లోకేశ్ కనకరాజ్, కార్తీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖైదీ! యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్నా.. ఇందులో కూతురు సెంటిమెంట్ అబ్బురపరుస్తుంది. కూతురు ముఖం కూడా చూడకుండానే జైలుకు వెళ్లిన తండ్రి ఏడేండ్ల తర్వాత జైలు నుంచి విడుదల అవుతాడు. అనాథాశ్రమంలో ఉన్న కూతురిని చూడాలనుకుంటున్న తండ్రి ఊహించని విధంగా ఓ పోలీస్ ఆపరేషన్‌లో భాగం కావాల్సి వస్తుంది. వరుసగా చేజింగ్ ఎపిసోడ్స్ వస్తున్నా.. హీరో తన బిడ్డను ఎప్పుడు కలుసుకుంటాడన్న ఆరాటం ప్రేక్షకుల్లో మొదలవుతుంది. తన బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని పరితపించిన హీరో.. తెల్లారేదాకా బతికుంటాడో, లేడో అనే స్థితికి చేరుకుంటాడు. యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుగా కథను నడిపించి ప్రేక్షకులను కట్టిపారేశాడు దర్శకుడు. సినిమా అంతా అంతర్లీనంగా సాగిపోయే కూతురును కలవాలన్న తండ్రి తపనే ‘ఖైదీ’ విజయానికి ప్రధాన కారణం.
వరల్డ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ చేసిన ఈ మాయాజాలం మూలకథ ఓ అడవిబిడ్డను రక్షించడమే! కుమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో కాల్పనిక చారిత్రక కథగా దీన్ని తెరకెక్కించాడు రాజమౌళి. కానీ, వీరిద్దరినీ ఒక్కతాటిపైకి తేవడానికి ఓ చిన్నారి పాత్రను ఎంచుకున్నాడు. ఆదిలాబాద్ అడవికి వచ్చిన బ్రిటిష్ దొర దంపతులు అక్కడి చిన్నారిని తమతోపాటు బలవంతంగా తీసుకెళ్తారు. ఆమెను కాపాడటానికి భీమ్ రంగంలోకి దిగుతాడు. ఢిల్లీకి వెళ్లిన భీమ్‌కు రామరాజు సాయం చేయడం, ఇద్దరూ కలిసి పాపను విడిపించడం మిగిలిన కథ! తెర మీద హీరోలిద్దరూ ఎన్ని విన్యాసాలు చేసినా.. ప్రధాన కథంతా పాప చుట్టూనే తిరుగుతుంది.
చాలారోజుల తర్వాత కమల్ హాసన్‌కు కమర్షియల్ విక్టరీని ఇచ్చిన సినిమా విక్రమ్. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రధాన కథ డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడం. అయితే, దీనికి అనుబంధంగా తాత, మనవడి కథ కనిపిస్తుంది. కొడుకును కోల్పోయిన తండ్రిగా, తండ్రిలేని తన మనవడిని కాపాడుకునే తాతగా కమల్ నటన ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. మాదకద్రవ్యాల ముప్పు నుంచి ముందుతరాలను కాపాడాలన్నది మూలకథ. ఇందులో ముందుతరానికి ప్రతినిధిగా ఓ పసివాణ్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ చిన్నారిని రక్షించే బాధ్యతను తాత పాత్రకు అప్పగించి మిగిలిన కథనంతా కమర్షియల్ పంథాలో నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లకు దీటుగా ఈ తాతామనవల సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.
ఏడాది కిందట కార్తీ ద్విపాత్రాభినయంతో వచ్చిన సినిమా ‘సర్దార్’. నీటి కాలుష్యం, ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ప్యాకింగ్ వల్ల కలిగే అనర్థాలను ఈ సినిమా కండ్లకు కట్టింది. ప్రధాన కథకు అనుబంధంగా ఉన్న ఓ పిల్లాడి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. క్యాన్సర్ బాధిత బాలుడు హీరో జర్నీలో కీలకంగా మారుతాడు. హీరో తండ్రితో స్నేహం చేస్తాడు. హీరో పాత్రను డామినేట్ చేసేంతగా ఆ చిట్టి పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు పీఎస్ మిత్రన్! ఆ బుడతడిగా మాస్టర్ రిత్విక్ పెర్ఫార్మెన్స్కు థియేటర్లో ఈలలు వేశారంటే ఆ పాత్ర ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సర్దార్ సక్సెస్‌లో ఈ చిట్టి పాత్రకు సింహభాగం వాటా ఉందంటే అతిశయోక్తి కాదు.