Santosh In Lionsgate Play | అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాల కారణంగా ఇండియాలోని థియేటర్లలో విడుదల కాలేకపోయిన హిందీ చిత్రం ‘సంతోష్’ (Santosh) ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక లయన్స్ గేట్స్ ప్లేలో(Lionsgates Play) ఈ చిత్రం అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాను ఇండియాలో చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కుల హింస, లింగ వివక్ష, గ్రామీణ ప్రాంతాల్లోని అవినీతి, పోలీసుల క్రూరత్వం వంటి సున్నితమైన అంశాలను వాస్తవికంగా చూపించారని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. దీంతో CBFC అధికారులు సినిమాలో ఎక్కువ కట్స్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొన్ని పాత్రల పేర్లు మార్చాలని కూడా సూచించారు. అయితే వీటికి మేకర్స్ అంగీకరించకపోవడంతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి బోర్టు నిరాకరించింది. దీంతో ఈ చిత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయగా.. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పోటి చేసి అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికి సంధ్యా సూరి దర్శకత్వం వహించగా.. నటి షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలోని కుల ఆధిపత్యం, లింగ వివక్ష ఉన్న ప్రాంతంలో ఈ కథ నడుస్తుంది. తన భర్త చనిపోయిన తర్వాత, అతని ఉద్యోగాన్ని స్వీకరించి పోలీసు కానిస్టేబుల్‌గా మారిన సంతోష్ సైనీ (షహానా గోస్వామి) అనే యువ వితంతువు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కానిస్టేబుల్‌గా జాయిన అయిన సంతోష్‌కి ఒక క్రూరమైన నేరాన్ని పరిశోధించే పని అప్పగిస్తారు పోలీసులు. అయితే ఈ దర్యాప్తులో సంతోష్‌కి తెలిసిన నిజాలు ఏంటి. సంతోష్‌కి సమాజంలో ఎదురైన సమస్యలు ఎంటి అనేది ఈ సినిమా కథ.