‘నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. ఇన్నేళ్లలో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాను. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చలేదు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలా నేను ఏదీ కూడా ప్రచారం చేసుకోలేదు’ అన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్. తెలుగు సినీరంగంలో అజాతశత్రువుగా పేరు పొందిన ఆయన ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనతో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ‘నా జీవితం తెల్ల కాగితం. నలుగురు చేసిన సహాయం నేనెప్పుడూ మర్చిపోలేదు. ఎంత సంపాదించినా నాలుగు మెతుకులు తప్ప ఏం తింటాం. ఇప్పటికీ నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.