Varun Dhawan | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వాషూ భగ్నానీ, దర్శకుడు డేవిడ్ ధావన్ మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు ముంబై హైకోర్టుకు చేరి తీవ్ర రూపం దాల్చింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో.. 1999 నాటి బ్లాక్‌బస్టర్ సినిమా ‘బీవీ నెం. 1’ లోని సూపర్ హిట్ సాంగ్ ‘చునరీ చునరీ’ని అనుమతి లేకుండా రీమిక్స్ చేశారంటూ వాషూ భగ్నానీ ఏకంగా రూ. 400 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేశారు. ఒకవేళ తమ డిమాండ్లను పట్టించుకోకుండా ఈ వివాదాస్పద కంటెంట్‌ను ఇలాగే ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 100 కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై వాషూ భగ్నానీ స్పందిస్తూ, ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని, నైతికతకు మరియు మేధో సంపత్తి హక్కుల (IPR) రక్షణకు సంబంధించిన పోరాటమని స్పష్టం చేశారు. ‘బీవీ నెం. 1’ చిత్రానికి తానే నిర్మాతని అని, తమను సంప్రదించకుండా ఆ చిత్రంలోని పాటను, టైటిల్‌ను (హై జవానీ తో ఇష్క్ హోనా హై అనేది కూడా బీవీ నెం. 1 లోని పాట లైనే) కొత్త సినిమాలో ఎలా వాడుకుంటారని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలో కనీస నైతిక విలువలు ఉండాలని, కనీసం ఒక ఫోన్ కాల్ చేసి అనుమతి అడిగి ఉంటే తానే ఉచితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేవాడినని ఆయన పేర్కొన్నారు. గతంలో తాము కేవలం ఆడియో హక్కులను మాత్రమే టిప్స్ సంస్థకు విక్రయించామని, కానీ వారు ఇప్పుడు అక్రమంగా వీడియో హక్కులను కూడా వాడుకుంటున్నారని భగ్నానీ తరఫు న్యాయవాది వి.కె. దూబే ఆరోపించారు. అంతేకాకుండా, డేవిడ్ ధావన్, రమేష్ తౌరానీలపై చీటింగ్, ఫోర్జరీ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన తెలిపారు.
మరోవైపు ఈ వివాదాలపై స్పందించిన ‘టిప్స్ ఇండస్ట్రీస్’ అధినేత రమేష్ తౌరానీ.. ఈ సమస్యలన్నీ త్వరలోనే సర్దుమణిగిపోతాయని, సినిమా ప్రమోషన్స్ లేదా విడుదల నిలిచిపోయే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన చెప్పారు. కాగా, తాము చట్టబద్ధంగానే ఆయా హక్కులను కలిగి ఉన్నామని, ఈ వివాదానికి సంబంధించి మే 22న దేశ అత్యున్నత న్యాయస్థానం నుండి కూడా ఉపశమనం పొందినట్లు టిప్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, పూజా ఎంటర్టైన్మెంట్స్ న్యాయవాది స్పందిస్తూ.. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే టిప్స్ సంస్థ సుప్రీంకోర్టు నుండి ఆ ఉత్తర్వులు పొందిందని, పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచడానికి తాము మళ్లీ పిటిషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం ఒక ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతోంది.