సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథ ‘గోదారి గట్టుపైన’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు నాగవంశీ. సుభాష్‌చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 8న విడుదలకానుంది. ఈ సినిమా గీతాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం చిత్ర సంగీత దర్శకుడు నాగవంశీ విలేకరులతో ముచ్చటించారు. ‘మా స్వస్థలం హన్మకొండ. నాన్న సంగీతకారుడు. ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. మాకు సొంతంగా ఓ స్టూడియో కూడా ఉంది. నాన్న దగ్గరే కీ బోర్డ్ నేర్చుకున్నాను. షార్ట్ఫిల్మ్స్కి మ్యూజిక్ చేస్తున్నప్పుడు దర్శకుడు సుభాష్చంద్రతో పరిచయం ఏర్పడింది. అలా ‘గోదారి గట్టుపైన’ సినిమాకు అవకాశం దక్కింది’ అన్నారు. కథానుగుణంగా సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రమిదని, ఓ రెట్రోసాంగ్ను సీనియర్ సింగర్స్ చిత్ర, యస్పీ చరణ్ ఆలపించారని, తాను కంపోజ్ చేసిన ట్యూన్‌ను వారు ప్రశంసించారని నాగవంశీ చెప్పారు. మొత్తం ఏడు పాటల్లో వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని, స్వతహాగా తనకు మెలోడీస్ అంటే ఇష్టమని, స్వరరచనలో అదే తన బలమని తెలిపారు. ‘ఇళయరాజా, రెహమాన్, మణిశర్మ, హారిస్ జైరాజ్లను స్ఫూర్తిగా తీసుకొని సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాను. ‘గోదారి గట్టుపైన’ చిత్రం మంచి గుర్తింపును తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’ అని నాగవంశీ పేర్కొన్నారు.