Janhvi Kapoor | కథానాయికల ప్రేమ, పెళ్లి విషయాల గురించి అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సదరు నాయిక ప్రేమలో ఉందంటే చాలు శుభవార్త ఎప్పుడు చెబుతుందోనని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు జాన్వీకపూర్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ఈ భామ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇటీవలే ఓ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన జాన్వీకపూర్ ‘శిఖు’ అనే లోగో వున్న నెక్లెస్‌ను ధరించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య బంధం నిజమేనని అభిమానులు అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్‌కు హాజరైన జాన్వీకపూర్ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా నాకు ధైర్యం చెప్పాలి. నా కలల సాకారానికి అండగా నిలవాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉంచాలి. అలాంటి వ్యక్తినే నేను పెళ్లాడతా’ అని చెప్పుకొచ్చింది. శిఖర్ పహారియాతో రిలేషన్షిప్ గురించి అడగ్గా సమాధానాన్ని దాటవేసింది. క్రికెట్ నేపథ్య కథాంశంతో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న విడుదల కానుంది.