సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘మన పోలీసులు చాలా కష్టపడి ఐబొమ్మ రవిని పట్టుకున్నారు.
ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పైరసీ వల్ల జరిగే నష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే పైరసీదారుల్ని కఠినంగా శిక్షించాలి’ అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సి.కల్యాణ్ మనవి చేశారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘పైరసీ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి నేరాలు చేసేవారిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉండాలి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అన్నారు.త్వరలోనే సిటీ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్‌తోపాటు పోలీసు అధికారులను ఫిల్మ్‌ఛాంబర్ తరఫున సత్కరిస్తామని నిర్మాతలు తెలియజేశారు.