నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ తదితరులు
కథ, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
నిర్మాతలు: అగరం సందీప్, కల్పన రావు
సంగీతం: సురేశ్ బొబ్బిలి
ప్రీమియర్ తేది: నవంబర్ 05, 2025
సినిమాటోగ్రఫీ: సోమ శేఖర్
ఎడిటింగ్: నరేష్ అడుప
థియేట్రికల్ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025
‘మసూద’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు నవంబర్ 5నే పడ్డాయి. మరి, పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
రమేష్ (తిరువీర్) ఒక ఫొటోగ్రాఫర్, ఫొటోస్టూడియో నడుపుతుంటాడు. పంచాయతీ సెక్రటరీ హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు, కానీ ఇద్దరూ తమ ప్రేమను బయటపెట్టుకోరు. ఈ క్రమంలో, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) తన పెళ్లి కోసం గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించడానికి రమేష్‌ను సంప్రదిస్తాడు. ఆనంద్-సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ ఎంతో రిచ్‌గా పూర్తి చేస్తాడు. అయితే, దురదృష్టవశాత్తూ, ఆ ఫుటేజ్ ఉన్న చిప్ మిస్ అవుతుంది. చిప్ పోయిన విషయం ఆనంద్‌కు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడ్డ రమేష్, ఆ సమస్య నుంచి బయటపడేందుకు హేమతో కలిసి ఆనంద్ పెళ్లినే చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ, అంతలోనే తన పెళ్లి ఆగిపోయిందని ఆనంద్ వచ్చి రమేష్‌కు ట్విస్ట్ ఇస్తాడు. అసలు ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది?
చిప్ ఎలా పోయింది? రమేష్-హేమల ప్రేమాయణం ఏమైంది? ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజ జీవితంలో పెళ్లి ఫొటోలు లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోలు మిస్ అవ్వడం అనేది అప్పుడప్పుడూ జరిగే సంఘటన. ఈ రియలిస్టిక్ పాయింట్‌ను తీసుకుని దానికి కామెడీ, ఎమోషన్స్‌ను జోడించి దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, రమేష్-హేమ లవ్ ట్రాక్, కామెడీ సీన్స్‌తో సరదాగా నడుస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఆఫర్ రావడం, ఆ షూటింగ్ తీసే విధానం, చిప్ పోవడం వంటి సన్నివేశాలు బాగానే ఉన్నా, కథ కొంచెం తెలిసిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే, ఆనంద్ తన పెళ్లి ఆగిపోయిందని చెప్పే ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో దర్శకుడు ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పెళ్లి, జ్ఞాపకాలు, అనుభూతులు ఫొటోగ్రాఫర్ చేతిలో ఉంటాయనే పాయింట్‌తో వచ్చే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి. చాలామంది కనెక్ట్ అయ్యేలా ఈ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఎమోషనల్ సీన్స్ తర్వాత మళ్లీ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి, క్లైమాక్స్‌ను కూడా మంచి కామెడీతో ముగించారు.
నటీనటులు
తిరువీర్ అమాయకంగా, భయపడే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అతని సహజ నటన సినిమాకు బలం.
టీనా శ్రావ్య క్యూట్‌గా, అందంగా ఆకట్టుకుంది. రమేష్‌తో లవ్ ట్రాక్‌లో బాగా నటించింది. నరేంద్ర రవి (ఆనంద్) కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతర నటీనటులు రోహన్ రాయ్ (చైల్డ్ ఆర్టిస్ట్) పర్వాలేదు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతికంగా
రచయితగా, దర్శకుడిగా రాహుల్ శ్రీనివాస్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కథ, కథనం సహజంగా, కామెడీతో కూడి ఉంది. అలాగే సోమ శేఖర్ కెమెరా పనితనం బాగుంది. శ్రీకాకుళం నేపథ్యంలో విజువల్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. సురేశ్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు వినడానికి బాగున్నాయి. నరేష్ అడుప ఎడిటింగ్ ఓకే. కొన్ని అనవసరమైన సీన్స్‌కు కత్తెర పడితే బాగుండేది. అగరం సందీప్, కల్పన రావు నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమాపై పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
చివరిగా.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనెక్ట్ అయ్యే ఒక సాధారణ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ఒక క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ను చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చవచ్చు. సినిమా నవ్వించి, మంచి ఎమోషన్స్‌తో మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5