తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. సందీప్ అగరం, అశ్మితారెడ్డి నిర్మాతలు. నవంబర్ 7న సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకులు కరుణకుమార్, యదువంశీ, ఆదిత్యహాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుష్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజా, నందకిశోర్ అతిథులుగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
‘ఈ కథ చెబుతున్నప్పుడు కంటిన్యూస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.’ అని హీరో తిరువీర్ నమ్మకం వెలిబుచ్చారు. ట్రైలర్‌కు వందరెట్లు సినిమా ఉంటుందని దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ అన్నారు. ఇంకా నిర్మాత సందీప్ ఆగరం, కథానాయిక టీనా, మాస్టర్ రోహన్, సురేశ్ బొబ్బిలి, నటి యామిని, నటుడు నరేంద్ర కూడా మాట్లాడారు.