‘డాన్-3’ వివాదం హిందీ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్రాంఛైజీ నుంచి రణ్‌వీర్‌సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. షూటింగ్‌కు కొన్ని వారాల ముందే ఆయన ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఫర్హాన్అక్తర్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) సంస్థను ఆశ్రయించారు. రణ్‌వీర్‌సింగ్‌పై నిషేధాన్ని విధిస్తున్నట్లు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆయన సినిమాలకు తమ యూనియన్ సభ్యులెవరూ పనిచేయరని తేల్చిచెప్పింది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు.
ఎంప్లాయిస్ ఫెడరేషన్ కాలం చెల్లిన వ్యవస్థ అని, తమ ఆధిపత్యం చూపించడానికి ఆంక్షలు అంటూ చవకబారు పనులు చేస్తుందని మండిపడ్డారు వర్మ. అసలు బ్యాన్ చేయాల్సింది ఫిల్మ్ ఫెడరేషన్‌నే అని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘తీర్పులు ఇవ్వడానికి ఫెడరేషన్ న్యాయస్థానమూ కాదు, ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదు. చట్టపరమైన నియమాల్ని పూర్తిగా పక్కనపెట్టి రహస్య అజెండాతో వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వాళ్ల పని. అదొక కంగారూ కోర్ట్’ అంటూ రామ్‌గోపాల్‌వర్మ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
రణ్‌వీర్‌సింగ్ వంటి స్టార్స్ వల్లే టికెట్లు తెగుతాయని, ఇండస్ట్రీకి రెవెన్యూ వస్తుందని, వారి వల్లే పరిశ్రమలోని వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. “ధురంధర్’తో రణ్‌వీర్‌కు వచ్చిన పేరుప్రఖ్యాతుల్ని చూసి ఓర్వలేని కొంతమంది ఈ ఫెడరేషన్లో సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ వివాదానికి, ఫెడరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇరు పార్టీలు న్యాయపరంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇది’ అని వర్మ తెలిపారు.