Om Shanti Shanti Shantihi | తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 30 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ముందుగా జనవరి 29 (గురువారం) సాయంత్రం ప్రీమియర్స్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులను ఆకట్టుకునేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా “ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం” అనే ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం దంపతులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే తక్కువ ధరలో సినిమా చూడాలనే ఉద్దేశంతో రెగ్యులర్ షో టికెట్లపై కూడా ఇప్పటికే ఆఫర్ ప్రకటించారు.
సింగిల్ స్క్రీన్స్: రూ.99 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లు: రూ.150 + జీఎస్టీగా రేట్లు నిర్ణయించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్న థియేటర్ల జాబితాను చిత్ర బృందం వెల్లడించింది. ఏషియన్ ముక్త సినిమాస్ – అగనంపూడి (విశాఖపట్నం), వీపీసీ – అమలాపురం, మినీ రేవతి – మచిలీపట్నం, గౌతమి – అనంతపురం. ఇక చిత్ర కథ విషయానికి వస్తే మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. అహంకారంతో కూడిన కోపిష్టి భర్తకు భార్య ఎలా బుద్ధి చెప్పిందన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని టాక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు కలిసి నిర్మించారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సంగీతాన్ని జై క్రిష్ సమకూర్చారు. కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ విలువల మేళవింపుతో రూపొందిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.