నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలున్న సినిమా ‘తండేల్’. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడన్న విషయం తెలిసిందే. ‘లవ్‌స్టోరీ’ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తున్నది. హైదరాబాద్ బీహెచ్ఈల్లో ఈ సినిమాకోసం అతిభారీ పాకిస్తానీ జైల్ సెట్‌ని నిర్మించారు. ఈ సెట్లో భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చెందు మొండేటి చిత్రీకరిస్తున్నారు.
‘యానిమల్’ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ సుప్రీం సుందర్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుండటం విశేషం. పాకీస్తానీ జలాల్లోకి ప్రమాదవశాత్తూ ప్రవేశించి అరెస్ట్ చేయబడ్డ మత్స్యకారునిగా ఇందులో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలనే ఈ సెట్లో చిత్రీకరిస్తున్నారట. కొన్ని రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ కొంతభాగం పూర్తవుతుంది. నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.