తమిళ అగ్ర హీరో దళపతి విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’) చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత.
తాజా సమాచారం ప్రకారం విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా అంగీకరించారని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన ఇటీవల దళపతి విజయ్‌కు ఓ కథ వినిపించారని చెబుతున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథ నచ్చడంతో విజయ్ వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
ప్రస్తుతం విజయ్ ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. దీని తర్వాత అట్లీ దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటించబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే గోపీచంద్ మలినేని సినిమా విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు.