TFJA | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జర్నలిస్టులు, సినీ ప్రముఖుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవి ప్రియపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్జేఏ) మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోసియేషన్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా వేదుల సూర్యనారాయణ మూర్తి వ్యవహార శైలి పరిశ్రమలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జర్నలిజం వృత్తి పరిమితులను దాటి వ్యక్తిగత కక్షలు, లక్ష్యంగా చేసుకున్న విమర్శలు, సినీ ప్రముఖులపై ఒత్తిడి వంటి అంశాలపై పలువురు దర్శకులు, నిర్మాతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆయనపై గతంలో టీఎఫ్జేఏ ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించింది. అనంతరం తిరిగి సభ్యత్వం పునరుద్ధరించినప్పటికీ ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదనే ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చడంతో తెలుగు సినీ దర్శకుల సంఘం నేరుగా రంగంలోకి దిగింది. వేదుల సూర్యనారాయణ మూర్తి చర్యల వల్ల దర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని టీఎఫ్జేఏకు అధికారికంగా లేఖ రాసింది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి ఎన్. సాయి రాజేష్ సహా పలువురు కీలక సభ్యులు ఆ లేఖపై సంతకాలు చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
దర్శకుల సంఘంతో పాటు నిర్మాతలు, పరిశ్రమలోని వివిధ విభాగాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన టీఎఫ్జేఏ కార్యవర్గం గత మార్చిలో ఆయనపై నిషేధం విధించింది. తాజాగా మరోసారి ఈ అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించిన కార్యవర్గ కమిటీ, పరిశ్రమ ప్రయోజనాలు మరియు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. సమీక్ష సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా ఏకగ్రీవంగా వేదుల సూర్యనారాయణ మూర్తిపై విధించిన నిషేధాన్ని కొనసాగించాలని తీర్మానించారు. తదుపరి అధికారిక నిర్ణయాలు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లోనే ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.టీఎఫ్జేఏ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభ్యులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలు గౌరవించాలని, పూర్తి సహకారం అందించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పరిశ్రమలో పరస్పర గౌరవం, క్రమశిక్షణ, వృత్తిపరమైన విలువలు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంది.