Raavu Balasaraswathi Devi | తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్రసీమ తొలి తరం నేపథ్య గాయనిగా ప్రసిద్ధి చెందిన రావు బాలసరస్వతి దేవి (Raavu Balasaraswathi Devi) బుధవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని మణికొండలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలసరస్వతి దేవి ఆగస్టు 29, 1928లో జన్మించగా.. తన ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టింది. ఇక ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు శ్రోతలకు ఆమె స్వరం సుపరిచితంకాగా.. ‘సతీ అనసూయ’ (1936) చిత్రంలో తొలిసారిగా పాట పాడి తెలుగు సినిమా తొలి నేపథ్య గాయనిగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో ఇప్పటివరకు 2000కు పైగా పాటలు ఆలపించి ‘లలిత సంగీత సామ్రాజ్ఞి’గా పేరు పొందింది బాల సరస్వతి దేవి. కాగా.. రావు బాలసరస్వతి దేవి మరణం పట్ల సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసినట్లైందని పలువురు పేర్కొన్నారు.