ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్‌మీట్ పెట్టుకొని తమను బెదిరించినట్లుగా మాట్లాడటం సరికాదని, అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు అగ్ర నిర్మాతలు కోరారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రెస్‌మీట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా బుధవారం తెలుగు నిర్మాతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిబిటర్ల మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అగ్ర నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం చూపించాలని నిర్మాతలు కోరారు.
ఈ సందర్భంగా మైత్రీ మూవీస్ యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘ఎగ్జిబిటర్ల ఇబ్బందుల పట్ల మాకు అవగాహన ఉంది. అదే సమయంలో నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. నాలుగైదు నెలలుగా సరైన సినిమాలు లేక ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ‘పెద్ది’ రూపంలో ఓ మంచి సినిమా వస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో వసతులు వుండవు కాబట్టి అన్నింటిని ఒకే విధంగా పరిగణించలేం. అందరం కలిసికట్టుగా చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు.
ఎగ్జిబిటర్లు షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి వచ్చే క్వాలిటీ కంటెంట్ తగ్గిపోతుందని, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని బెదిరించినట్లుగా మాట్లాడటం సరైనది కాదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో పర్సంటేజీ విధానాన్ని అంగీకరించలేమని, కొత్తగా తీసే సినిమాల విషయంలో ఆలోచిస్తామని, దానికీ కొన్ని షరతులు ఉన్నాయని ఆయన తెలిపారు. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జెస్, ఆన్లైన్ టికెట్ బుకింగ్, కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత పర్సంటేజీ విధానానికి వెళ్లడంలో తమకు అభ్యంతరం లేదని సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. ఒక్కో సినిమాకు ఒక్కోలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, అందరం సమస్యపై చర్చించి అవగాహనతో వ్యవహరించాలని నిర్మాతలు సాహు గారపాటి, సుధాకక్ చెరుకూరి కోరారు.