తెలుగు సినిమా అదృష్టంపై ఆధారపడే పరిశ్రమ. ఇక్కడ హిట్టే ముఖ్యం. విజయాలే ఇక్కడ అవకాశాలు తెచ్చిపెడుతుంటాయి. అందుకే ఉన్నంతలో విభిన్న కథల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నది తెలుగమ్మాయి రీతూ వర్మ. పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ తానుంటే సినిమాకెళ్లే ఆడియన్స్ని సంపాదించుకుంది. ఈమె నటించిన ‘దేవిక అండ డానీ’ అనే వెబ్ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ ‘సినిమా అనేది టీమ్ వర్క్.
హిట్టూ, ఫ్లాపూ ఒకరి చేతిలో ఉండదు. హిట్ అయితే క్రెడిట్ ఒకరే కొట్టేయడం, ఫ్లాప్ అయితే ఏ ఒక్క వ్యక్తినో నిందించడం సబబు కాదు. చాలాసార్లు ఫ్లాప్ అయితే హీరోహీరోయిన్లపై నిందలేస్తుంటారు. ఇంకా మాట్లాడితే గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అంటూ బిరుదులిచ్చేస్తుంటారు. తొలినాళ్లలో నేను నటించిన సినిమా సరిగ్గా ఆడకపోతే బాధపడేదాన్ని. ఇప్పుడైతే పట్టించుకోవడం మానేశా. సినిమా ఫలితం దైవాధీనం.. అంతే. ప్రస్తుతమైతే నా ఫోకస్ అంతా నటనపైనే. విభిన్నమైన పాత్రలు చేయాలనే కోరిక ఉంది’ అని చెప్పుకొచ్చింది రీతూవర్మ.