71th National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ చిత్రం ‘12th ఫెయిల్’ ఎంపిక కాగా, ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును ‘జవాన్’ చిత్రం నుంచి షారుక్‌ఖాన్, ‘12th ఫెయిల్’ చిత్రం నుంచి విక్రాంత్ మస్సే పంచుకున్నారు. ఇక మరో బాలీవుడ్ చిత్రం ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’లో అద్భుతమైన నటనను కనబరచిన సీనియర్ నటి రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమనటిగా ఎంపికయ్యారు.
ఈ సారి ప్రకటించిన అవార్డులలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండిందనే చెప్పాలి. ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి. బాలకృష్ణ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ‘ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం’ అవార్డును గెలుచుకుంది. అలాగే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ ‘హను-మాన్’.. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. అలాగే సాయిరాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రూపొందిన ప్రేమకావ్యం ‘బేబీ’కి బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సింగింగ్ అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయిరాజేష్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ బాలనటి కేటగిరిలో ‘గాంధీతాత చెట్టు’ సినిమా నుంచి సుకృతివేణి అవార్డుకు ఎంపికైంది.
తెలంగాణ మట్టి పరిమళాలు గుబాలించిన ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటకుగాను కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయరచయితగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ ప్రకృతి రమణీయతను, శ్రమైక గ్రామీణ సౌందర్యాన్ని, అక్కడి మనుషుల మధ్య ఆప్యాయతలను ఈ గీతంలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతంగా ఆవిష్కరించారు. మంగ్లీ, రామ్ మిరియాల ఆలపించిన ఈ గీతం సంగీతప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
నిజాయితీ గల ఐపీఎస్ అధికారి మనోజ్కుమార్శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మనోజ్కుమార్శర్మగా ఇందులో విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించారు. చంబల్‌లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన కుర్రాడు మనోజ్. నిజాయితీగా ఉండటమే తన తండ్రి సస్పెన్షన్‌కి కారణం కావడం, అవినీతి చేస్తూ తన స్కూల్ హెడ్ మాస్టర్ అరెస్ట్ కావడం.. ఈ సంఘటనలు అతని మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. జీవితంలో నిజాయితీ ఎంత విలువైనదో తెలుసుకున్న మనోజ్.. కాలక్రమంలో గొప్పవాడిగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేదే ‘12ఫెయిల్’ సినిమా. వినోదంతోపాటు చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వాణిజ్యపరంగానే కాక, ఈ 71వ జాతీయ పురస్కారాల్లో కూడా ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం, ఇందులో మనోజ్కుమార్శర్మగా అభినయించిన విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడిగా నిలవడం నిజంగా హర్షించదగ్గ విషయమే.
అట్లీ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ నటించిన కమర్షియల్ ఎంటైర్టెనర్ ‘జవాన్’. ఇందులో ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయి. హైజాకర్‌గా, జైలర్ ఆజాద్‌గా, ఆర్మీ అధికారి విక్రమ్ రాథోడ్‌గా రకరకాల పాత్రల్లో కనిపిస్తారు షారుక్. ఆయన కెరీర్లో ఈ తరహా పాత్ర చేయడం ఇదే ప్రథమం. ద్విపాత్రాభినయంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు షారుక్. ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 1200కోట్ల రూపాయలు వసూలు చేసి, బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.
బాలకృష్ణలోని మాస్ యాంగిల్‌ని జనరంజకంగా ఆవిష్కరిస్తూ, మరోవైపు చక్కని సందేశంతో ‘భగవంత్ కేసరి’ సినిమాను మలిచారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందులో వయసుకు తగ్గ పాత్రలో బాలకృష్ణ డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేయకూడదు. ఆడపిల్లలను పులుల్లా పెంచాలి. ఎలాంటి సమస్యనైనా ఎదిరించి నిలబడేలా వాళ్లను తీర్చిదిద్దాలి అనే సందేశమే ఈ సినిమాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలబెట్టింది. ఇందులో ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అంటూ ఆడపిల్లలకు ఓ సన్నివేశంలో బాలకృష్ణ చెప్పే సూచనలు చర్చనీయాంశమయ్యాయి. ఆ సన్నివేశం నచ్చి, తన తాజా చిత్రం ‘జననాయగన్’లో ఆ సన్నివేశాన్ని చేర్చారు తమిళ అగ్రహీరో విజయ్.
ఆంజనేయస్వామి నేపథ్యంలో వచ్చిన మైథలాజికల్ ఫాంటసీ ఫిక్షన్ ‘హను-మాన్’. ఓ సామాన్యుడు ఆంజనేయ కృపతో సూపర్ హీరోగా ఎలా మారాడు? అనేదే ఈ సినిమా ఇతివృత్తం. ైక్లెమాక్స్‌లో హనుమాన్‌ని సాక్షాత్కరింపజేసి సినిమాను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ముఖ్యంగా పతాక సన్నివేశంలో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. అలాగే పోరాటాలు సైతం ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
బహు విరామం తర్వాత తెలుగుతెరపై మెరిసిన విషాద ప్రేమకథ ‘బేబీ’. నేటి యువత పోకడలను ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయిరాజేష్ అద్దం పట్టాడు. పైపై మెరుగులు ముఖ్యమనుకొని బంధాలను దూరం చేసుకు న్న ఓ అమాయకురాలి కథ ఇది. తను చెప్పాలనుకున్న అంశాన్ని బోల్డ్‌గా, జనానికి అర్ధమయ్యేలా అద్భుతంగా చూపించారు దర్శకుడు సాయిరాజేష్. ఆయన రాసుకున్న కథ, కథనమే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. అంతేకాక వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కూడా అద్భుతంగా నటించారు. అలాగే.. ఇందులోని పాటలు సైతం శ్రోతల్ని బాగా అలరించాయి. ముఖ్యంగా పీవీఎన్ఎస్ రోహిత్ పాడిన ‘ప్రేమిస్తున్నా..’ పాట యూత్‌లో బాగా వైరల్ అయ్యింది.