ఒకప్పుడు హీరో ఎలివేట్ కావడానికి.. చుట్టూ ఓ నలుగురుదోస్తులు ఉండేవాళ్లు.ఈ తొట్టిగ్యాంగ్ పిట్టగోడెక్కి లొట్టిపిట్టల్లా మెడలు సాచి.. కుళ్లు జోకులు వేస్తూ ఉండేవాళ్లు. హీరో చేతుల్లో తన్నులు తింటూరీల్స్ గడిపేసేవాళ్లు. తీరా ఎడిటింగ్ అయ్యాక వాళ్ల ప్రతిభ నాలుగు సీన్లకుపరిమితమయ్యేది. వీళ్ల రెమ్యునరేషన్ కిళ్లీ కొట్లో ఖాతా అంతే ఉండేది!! కానీ, ఇప్పుడు అలా కాదు.. టైమ్మారింది.. డైరెక్టర్లు మారారు.. వారి తాలుకూ కథలు మారాయి.. ఆ నలుగురు ఫ్రెండ్సే హీరోలుగా ముందుకొస్తున్నారు.. చరితనుమార్చేది వీళ్లు.. అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు..
Telugu Cinema | ‘ఆయ్..’ మేం మీ ‘కమిటీ కుర్రాళ్లం’ అంటున్నారు యంగ్ ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్తే.. ఆ ‘జాతిరత్నాల’ గురించి ఎంతైనా చెప్పొచ్చు. ‘బ్రోచేవారెవరురా’ అంటూ హీరోలే సినిమాల్ని కాపాడనక్కర్లేదని నిరూపించారు. ‘ఓం భీమ్ బుష్’ అంటూ అల్లరి చేశారు.. ప్రేక్షకుల్ని అలరించారు. అందుకే ఇప్పుడో ట్రెండ్ నడుస్తున్నది.. కథలు చెప్పేందుకు క్యారెక్టర్లు కావాలి తప్ప.. కటవుట్తో పని లేదని..!! అందుకే కంటెంట్ ఉన్న కుర్రాళ్లంతా.. సక్సెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు.
సినిమా అవకాశాలంటే ఒకప్పుడు పెద్ద ప్రాసెస్ ఉండేది. ఫొటోషూట్లు చేయడం. ఆల్బమ్‌లు పట్టుకుని ఇండస్ట్రీలోని గడపలన్నీ ఎక్కిదిగడం ఉండేది. అదృష్టవంతులకు అవకాశం రావడానికి నెలలు పడితే.. ఇతరులకు ఏళ్లూపూళ్లూ గడిచేవి. ‘ఒకే ఒక్క చాన్స్’ కోసం జీవితకాలం ఎదురు చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. ఫొటోషూట్లు.. ఆల్బమ్‌ల స్థానంలో.. సొంత యూట్యూబ్ చానెళ్లు.. ఇన్‌స్టా అకౌంట్లు వచ్చేశాయ్! రీల్స్‌తో రియల్‌లైఫ్‌లో హీరోలు అయిపోతున్నారు. ఎవరి షార్ట్‌ఫిల్మ్‌లు వారికి ఎటూ ఉన్నాయ్. ఇవన్నీ దాటుకుని కొందరు.. ఓటీటీల్లో టాలెంట్ చూపిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ.. మొబైల్ మాధ్యమాల్లోనూ.. ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో నటించిన వారిలో చాలామంది ఈ కోవకు చెందినవారే. ముఖ్యంగా ప్రసాద్ బెహరా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ప్రసాద్ సుపరిచితుడే! యూట్యూబ్‌లో అతగాడి షార్ట్ ఫిల్మ్స్‌కి పిచ్చ లైక్లూ.. కామెంట్లూ వచ్చిపడుతుంటాయ్! తన కామెడీ టైమింగ్‌తోనే కాదు.. సెంటిమెంట్ డైలాగ్స్తోనూ.. రైటర్‌గా సత్తాచాటాడు ప్రసాద్. ‘కమిటీ కుర్రోళ్లు’లో తనదైన నటనతో అందరి మెప్పూ పొందాడు. ప్రసాద్.. ఓ అంగన్వాడీ టీచర్ కొడుకు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనివాడు. యూట్యూబ్‌ను నమ్ముకున్నవాడు. అటువంటి వాడు ఈ రోజు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ప్రసాద్ ఒక్కడే కాదు.. ‘కమిటీ కుర్రాళ్లు’లోని 11 మందీ వారివారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. అందుకేనేమో.. మెగాస్టార్ సైతం ఈ యువకులు ఖుష్ అయ్యేలా… ‘అందరూ చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు నటించారనే విషయాన్ని మరచిపోయాను. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చక్కగా పండాయి..’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
సదా.. సీదా కుర్రాళ్లకే ఫిదా!
ఓ నలిగిపోయిన కాటన్ షర్ట్.. చెదిరిపోయిన జుట్టుతో ‘తమ్ముడూ’ అని పిలిచి.. ‘తొలిప్రేమ’తో అలరించిన పవర్ స్టార్ రోజులు గుర్తున్నాయా? ఓ ఇరవై ఏండ్ల క్రితమే ఆ నలుగురు ఫ్రెండ్స్‌లో పవన్ చాలా కాజువల్‌గా కలిసిపోయాడు. హీరో అంటే సిక్స్ప్యాక్స్తో సిక్స్ ఫీట్ ఉండక్కర్లేదు.. పక్కింటి అబ్బాయ్‌లా ఉన్నా చాలని ప్రూవ్ చేశాడు. దాన్నే నేటితరం జెన్ ‘జీ’ బాగా జీర్ణించుకుని సినిమా జిందగీలో తమదైన ముద్రవేస్తున్నది. జాతిరత్నాలుగా సిల్వర్ స్క్రీన్ తెరపై వెలుగుతున్నది. ‘నేను రైస్ పెడతా.. నువ్వు కర్రీస్ తే మామ!’ అంటూ రియల్ లైఫ్ రూమ్మేట్స్కి బ్యాచిలర్ లైఫ్‌ని గుర్తుచేసిన ప్రియదర్శిని ఎలా మర్చిపోతాం. ‘ఎంత పెద్దమాట అన్నాడు సార్ వాడు.. ’ అంటూ నవీన్ పొలిశెట్టిని మరెవ్వరితో పోల్చలేం.
కాళ్లకు హవాయ్ చెప్పులు కూడా వేసుకోని.. డైరెక్టర్ అనుదీప్‌ని అయితే సింప్లిసిటీకి కేరాఫ్ అనొచ్చు. తన డైలాగ్స్, మేనరిజమ్స్‌తో నేటి కుర్రాళ్లకు తనదైన సిగ్నేచర్ సౌండ్స్‌తో కొత్త ఊపు తీసుకొచ్చాడు. ైక్లెమాక్స్ అంటే.. గుండెల్నీ పిండేసే సన్నివేశాలు.. బాంబ్‌బ్లాస్ట్‌లు.. రక్తపాతాలు, చివరాఖరికి సందేశాలు అని బలంగా ఫిక్సయిన తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా ముగింపు పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. మామూలు కథలను.. అంతకన్నా సాదాసీదా కుర్రాళ్లతో తీసి హిట్ కొట్టొచ్చని నిరూపించాడు అనుదీప్. ఈ నయా దోస్తులు కామెడీ టైమింగ్‌లోనే కాదు.. స్టోరీని నడిపించడంలోనూ, సంభాషణల్ని పండించడంలోనూ… దిట్టలు అనిపించుకున్నారు.
ఏ యాస మాట్లాడినా.. ఎలాంటి ప్రాసలు వాడినా.. కథను నడిపించడానికి క్యారెక్టర్లే ముఖ్యం. అలా ఓ ముగ్గురు యువకులు గోదారి గట్టుపైన చేసిన సందడే ‘ఆయ్’ సినిమా! అందమైన బాల్యం, చిన్ననాటి జ్ఞాపకాలు, అనుబంధాలు, పల్లె అందాలను తమ పదునైన యాసతో కలగలిపి కార్పొరేట్ వరల్డ్‌కు పరిచయం చేశారు ఆ ముగ్గురు. ఇవి కదా ఆర్గానిక్ కథలు అంటూ.. హెల్తీ కంటెంట్‌ను అందించారు. ఇంకేముంది.. ‘ఆయ్’ సూపర్ హిట్. చిన్న కథల్లో, చిన్న నటుల్లో ఇంత పెద్ద సక్సెస్ దాగుందని ఇండస్ట్రీలోని పెద్దవాళ్లూ బలంగా నమ్ముతున్నారు. అందుకే బడా నిర్మాతలు బారికేడ్లు తీసేసి బడ్జెట్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. ఉత్సాహవంతులైన యువకులు ఎవరైనా మంచి కథతో వస్తారేమోనని ఎదురుచూస్తున్నారు.
సినిమా హిట్ అవ్వాలంటే.. ‘ప్రధాన తారాగణం భారీ నటులై ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ అదిరిపోవాలి.. ఇంటర్వెల్‌కు ముందు ట్విస్ట్ ఉండాలి.. ైక్లెమాక్స్‌లో కండ్లు చెమ్మగిల్లాలి..’ ఈ ఫార్ములాకు కాలదోషం పట్టిందనే చెప్పాలి. ఈ తరహా కథలతో ప్రొడ్యూసర్ ఇంటి ముందు పడిగాపులు కాసే కుర్రాళ్లు ఇప్పుడు వెతికినా దొరకరు. గల్లీ పోరగాళ్ల కథతో విజయాన్ని అందుకుంటున్నారు. సిల్లీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. వీరి ట్రెండ్ గమనించిన పెద్ద హీరోలు సైతం.. ఈ యంగిస్థాన్లను ఇంటికి పిలిపించుకొని మరీ ప్రశంసిస్తున్నారు. ఈ తరహా యంగ్ థాట్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ స్టార్డమ్ లేని దోస్తుగాళ్లను ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీలను చేసేస్తున్నారు. అందుకే కుర్రాళ్లే.. నేటి తెలుగు సినిమా మొనగాళ్లు! అనడంలో సందేహమే లేదప్పా!!
అప్పుడూ ఉన్నారు
నలుగురు స్నేహితులు ఆడుతూపాడుతూ సందడి చేసిన సినిమాలు తెలుగులో గతంలోనూ ఉన్నాయి. నలుగురికీ సమప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రం తక్కువనే చెప్పాలి. స్నేహితులంతా కలగలిసి కథను నడిపించిన సినిమాల్లో ఒకటి ‘మధురానగరిలో’. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1991లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కథను కామెడీ జానర్‌గా తెరకెక్కించి సక్సెస్ కొట్టాడు కోడి. ఇందులో శ్రీకాంత్, రవిశంకర్, చిన్నా, రియాజ్ ఖాన్ నలుగురు స్నేహితులుగా నటించారు. శ్రీకాంత్ కూడా అప్పటికి కొత్త హీరోనే! కథానాయిక నిరోష. వీరితో డైరెక్టర్ కోడి రామకృష్ణ చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు హిట్ చేశారు. దర్శకుడు వంశీ తొలిచిత్రం ‘మంచుపల్లకీ’ దోస్తులందరి కథే! ప్రధాన స్నేహితుడు చిరంజీవి. అతని జోడుగాళ్లుగా రాజేంద్రప్రసాద్, సాయిచంద్, గిరీష్ ప్రధాన్, నారాయణరావు మెప్పించారు. కథానాయిక సుహాసిని. విషాదంతో అంతమయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది.
…? రాజేశ్ యడ్ల