Tollywood | సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. అయితే ఈ మీటింగ్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణలోని అడ్మిషన్ రేట్స్‌పై ఇచ్చిన జీవోలను ఏవిధంగా అమలు చేయాలనే విధానంపై ఆదివారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. దీంతో పాటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ నియమ నిబంధనలు, ఫిలిం ట్రైలర్స్, పబ్లిసిటీ ఛార్జీలు, వీవీఎఫ్ ఛార్జీలు, ఆన్లైన్ టిక్కెటింగ్ సంస్థల విధివిధానాలు, ఓటీటీ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపింది. చిన్న సినిమాలు మరింత మనుగడ సాధించేందుకు అందరూ ఏకాభిప్రాయంతో ఉండి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తామని ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలను ఏకతాటిపై ఉండి సాధించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఇందుకోసం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో హైలెవల్ సబ్ కమిటీ నిర్ణయించి తగు నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్, గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.