Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) 2025–27 కాలానికి సంబంధించి కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలవగా, మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్లకు చెందిన మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు, కార్యదర్శి సహా మొత్తం 32 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి అభ్యర్థి బరిలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా ‘మన ప్యానెల్’ మరియు ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ మధ్య గట్టి పోటీ నెలకొంది. చిన్న నిర్మాతల నుంచి ఎక్కువ మద్దతు ‘మన ప్యానెల్’కు లభిస్తుండగా, ఈ ప్యానెల్‌కు సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్ బలమైన మద్దతు ప్రకటించారు. మరోవైపు, అగ్ర నిర్మాతలు అల్లూ అరవింద్, దిల్ రాజు, డి.సురేశ్ బాబు మద్దతుతో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ బరిలోకి దిగింది. పోలింగ్ సమయంలో ఇరు ప్యానెళ్ల కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొనగా, ఒక దశలో యలమంచిలి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంలో దిల్ రాజు జోక్యం చేసుకుని సముదాయించారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎప్పుడూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. ఈసారి కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానుండగా, ఎవరు విజయం సాధిస్తారో చూడాలి అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు పాల్గొంటారు. వీరు అందరు నాలుగు సెక్టార్ట్స్కి సంబంధించిన చైర్మన్స్ని అలానే 44 మంది కార్యవర్గ సభ్యులని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నికైన సభ్యులు ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది.